ప్రజావ్యతిరేక ప్రభుత్వాన్ని దింపాలి : జూలకంటి
నల్లగొండ,అక్టోబర్23(జనంసాక్షి): రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని సిపిఎం నాయకుడు జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకుపోయి వారిని ఉద్యమాలకు సమాయత్తం చేయడమే సిపిఎం లక్ష్యమని తెలిపారు ఎన్నికల ముందు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకిచ్చిన వాగ్ధానాలు అమలు కావడం లేదని రంగారెడ్డి అన్నారు. ధాన్యం మార్కెట్లకు వచ్చిన గిట్టుబాటు ధరలు దక్కడం లేదన్నారు. దళారులు దోచుకుంటున్న పట్టించుకోవడం లేదన్నారు. తెలంగాణ వచ్చిన సంతోషం రైతులకు కూడా ఉండాలంటే వ్యవసాయ ఉత్పత్తులు గిట్టుబాటు ధరలకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల గురించి వ్యవసాయం గురించి గొప్పగా పెబుతున్న ప్రభుత్వం కార్యాచారణలో మాత్రం ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. అనావృష్టి, అతివృష్టిలతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రభుత్వం రైతులకు భరోసా కల్పించక పోవడం శోచనీయమన్నారు. గిట్టుబాటు ధరలు దక్కక, మార్కెట్లకు వచ్చే రైతులు దళారీల దోపిడీకి గురవుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. నకిలీ విత్తనాల నిరోధంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయలో పలు అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఇంతగా ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్న కెసిఆర్ ప్రభుత్వాన్ని దింపాలన్నారు. అందుకు ప్రజలు ముందుకు రావాలన్నారు.