ప్రజాసమస్యల పరిష్కారంలో కెసిఆర్ విఫలం
భద్రాచలం అభ్యర్థి మిడియం
భద్రాచలం,డిసెంబర్1(జనంసాక్షి): ప్రజా సమస్యల పరిష్కారంలో తెరాస, కాంగ్రెస్‌లు పూర్తిగా వైఫల్యం చెందాయని భద్రాచలం సీపీఎం అభ్యర్థి డాక్టర్ మిడియం బాబురావు అన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, లౌకిక సామరస్య పరిరక్షణ, ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య పునరుద్ధరణ వంటి 5 అంశాలతో బీఎల్‌ఎఫ్ ముందుకు సాగుతుందని అన్నారు. యూపీఏ ప్రభుత్వంలో వామపక్షాల పోరాటాలతో సాధించిన
అటవీ హక్కుల చట్టాన్ని కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసి గిరిజనులపై పీడీ యాక్టు కేసులు పెడుతోందని ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలను వారి ఆశయాలను నెరవేర్చుతామని
అధికారంలోకి వచ్చిన తెరాస, హావిూలను విస్మరించిందని పేర్కొన్నారు. తెలంగాణకు అవసరమైన ప్రత్యామ్నాయం బీఎల్‌ఎఫ్ మాత్రమేనని అన్నారు. నాలుగున్నరేళ్ల కుటుంబ పాలనలో ఎంతసేపు పథకాల పేరిట దోచుకోవడానికే ప్రాధాన్యం ఇచ్చిందని ఆరోపించారు. రాష్ట్రంలో తెరాస, భాజపా లాలూచి పడ్డాయని ఆరోపించారు. భద్రాచలం నియోజకవర్గంలో రైతుల హక్కుల కోసం నిజాయతీగా పోరాడే తనను గెలిపించి శాసనసభకు పంపించాలని విజ్ఞప్తి చేశారు.