ప్రజాసేవ పట్టని విపక్షనేత జగన్‌: టిడిపి

కర్నూలు,జూన్‌29(జనం సాక్షి ): ప్రజాసేవలో ప్రభుత్వం తరిస్తుంటే ప్రతిపక్షనేత జగన్‌ అబద్ధాల మాటలుచెబుతూ వారిని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని టిడిపి జిల్లా నేత సోమిశుట్టి వెంకటేశ్వర్లు విమర్శించారు. ప్రజలే అతనికి బుద్ధి చెప్పాలని విజ్ఞప్తిచేశారు. ప్రజలు విజ్ఞత కలిగిన వారని, జగన్‌ మొసలి కన్నీళ్లను నమ్మరని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఓటమి తథ్యమని తెలిసి ఆయనలో ఆందోళన మొదలైందని, ఆ ఆందోళనతోనే సంయమనం కోల్పోయి మతిలేని మాటలు మాట్లాడుతున్నారని చెప్పారు. ప్రజలు అభివృద్ధికే ఓటు వేస్తారని, అవినీతికి కాదనే విషయం తెలుసుకుని జగన్‌ ఇప్పటికైనా మారితే మంచిదన్నారు. విభజన తరవాత ఇప్పుడు ప్రజలు అభివృద్ది కోరుకుంటున్నారని అన్నారు. అన్నదాతల కుటుంబాల్లో ఆనందం చూడటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. టిడిపిగెలుపుతో అభివృద్దికి బాటలు వేయాలని అన్నారు. రాయలసీమలోని అన్ని జిల్లాల్లోని చెరువుల్లో సాగు, తాగునీటిని నింపేందుకు రూ.750 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. రెండుకార్లకు పుష్కలంగా సాగునీరందిస్తామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ఎన్టీఆర్‌ ఆరోగ్యరక్ష, తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆహార భద్రతకు అర్హులైన ప్రతి పేదకుటుంబానికి బియ్యం కార్డు అందజేయడం తథ్యమన్నారు. నీటి సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్నారు. రేపటి భవిష్యత్తు కోసం ప్రజలు పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని వేల కోట్లు అవినీతి చేసి 12 కేసుల్లో ఏ1 ముద్దాయిగా ఉన్నాడని తెలిపారు. జగన్‌ ఆర్థిక నేరాల వల్ల ఎంతోమంది అధికారులు, పారిశ్రామిక వేత్తలు రోడ్డున పడ్డారని, జైలు పాలయ్యారని తెలిపారు.

———–