ప్రజా సమస్యలు గాలికొదిలి వైవిధ్యమే మాట్లాడితే అర్థం లేదు
మేధాపాట్కర్
హైదరాబాద్,అక్టోబర్ 16(ఆర్‌ఎన్‌ఎ): జీవవైవిధ్య సదస్సు జరుగుతున్న తీరుపై సందీప్ పాండే అసంతృప్తి వెళ్లగక్కగా, మరో పర్యావరణ వేత్త మేధాపాట్కర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అసలు అక్కడ ప్రజలకు సంబంధించి చర్చలు జరగడం లేదని ఆందోళన వెలిబుచ్చారు.
అంతర్జాతీయ జీవవైవిధ్య సదస్సులో జీవవైవిధ్యం పరిరక్షణపై పెద్దగా చర్చలు జరగడం లేదని ప్రముఖ సామాజిక ఉద్యమకారిణి మేధాపాట్కర్ ఆక్షేపించారు. దేశంలో ఆర్థిక సరళీకృత విధానాల పుణ్యమాని పారిశ్రామికీకరణ, అభివృద్ధి పేరిట కార్పొరేట్, ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వ భూములు కట్టబెడుతూ జీవవైవిధ్యాన్ని దెబ్బతీస్తోందని మండిపడ్డారు. భూములు కోల్పోయిన రైతులు, వ్యవసాయ కార్మికులు, మత్స్యకారులు ఉపాధి కోల్పోతున్నారని ధ్వజమెత్తారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ప్రజా ఉద్యమాల వేదిక ఆధ్వర్యంలో జరిగిన ప్రజల జీవవైవిధ్య ఉత్సవాలకు ఆమె హాజరయ్యారు. దేశవ్యాప్తంగా కోస్తా తీరం వెంబడి థర్మల్ విద్యుత్తు కేంద్రాల ఏర్పాటు కోసం పెద్ద ఎత్తున విలువైన భూములు సేకరిస్తూ సహజ వనరులను కొల్లగొడుతూ పేదల పొట్టగొడుతున్నారని మేధాపాట్కర్ ఆరోపించారు. భూములను పరిశ్రమలుగా మారుస్తు పాలకులే పర్యావరణ విధ్వంసకులుగా చేరిపోతున్నారని ఆమె అన్నారు. ఈ విధానం పోతే తప్ప దేశం బాగుపడదని చెప్పారు.