ప్రతిపక్షాలు ప్రజలను రెచ్చగొడుతున్నాయి

– సంఘ విద్రోహశక్తుల మూలంగానే స్టెరిలైట్‌ ఆందోళన పక్కదారిపట్టింది
– తమిళనాడు సీఎం పళనిస్వామి
చెన్నై, మే24(జ‌నం సాక్షి) : స్టెరిలైట్‌ ఆందోళనకారులపై పోలీసులు జరిపిన ఫైరింగ్‌ ను ఆ రాష్ట్ర సీఎం పళనిస్వామి సమర్థించారు. గురువారం ఆయన విూడియాతో మాట్లాడుతూ.. ఆ నిరసనల వెనుక కొన్ని రాజకీయ పార్టీలు, ఎన్జీవోలు, సంఘ విద్రోహ శక్తులు ఉన్నాయన్నారు. వారి వల్లే ఆందోళన తప్పుదోవ పట్టిందన్నారు. స్టెరిలైట్‌ ఆందోళనకారులపై జరిగిన ఫైరింగ్‌లో సుమారు 13 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. ఒకవేళ ఎవరైనా అటాక్‌ చేస్తే, సహజంగా వాళ్లను తిప్పికొడుతామని, వాళ్లను వాళ్లు రక్షించుకోవడం జరుగుతుందని, ఇదే ట్యూటికోరిన్‌లో జరిగిందని సీఎం పళని తెలిపారు.స్టాలిన్‌కు అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదన్న ఆరోపణలను సీఎం పళని కొట్టిపారేశారు. ప్రతిపక్షాలు కావాలనే ప్రజలను రెచ్చగొడుతున్నాయన్నారు. ముందస్తు ప్లానింగ్‌తోనే డీఎంకే నేతలు.. సెక్రటేరియేట్‌ ముందు ధర్నా చేపట్టారని సీఎం ఆరోపించారు. అంతకముందు ఉదయం స్టెరిలైట్‌ కంపెనీకి విద్యుత్తు సరఫరాను నిలిపేశారు. సీఎం పళనిస్వామి రాజీనామా చేసే వరకు తమ పోరాటం ఆగదు అని డీఎంకే నేత స్టాలిన్‌ అన్నారు.