ప్రతిపక్ష పాత్ర పోషించండి
ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజా క్షేత్రంలోకి వెళ్లండి
కాంగ్రెస్ శ్రేణులకు దిగ్విజయ్ పురమాయింపు
హైదరాబాద్,జనవరి20(జనంసాక్షి): తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పై ఇక దూకుడుగా వెళ్లాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్‌తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులకు సూచించారు. హైదరాబాద్ గాందీ భవన్ లో కాంగ్రెస్ మేధో మదనంలో ఆయన పాల్గొన్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ హనీమూన్ కాలం ముగిసిందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి 8 నెలలవుతోందని , గ్రేస్ పీరియడ్ అయిపోయినట్లేనని ఆయన అన్నారు. అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టడంలో దూకుడుగా వ్యవహరించాలని కాంగ్రెస్ నేతలకు సలహా ఇచ్చారు. కాగా కాంగ్రెస్ ను వదలి వెళ్లినవారు రాజీనామా చేసేలా వారి ఇళ్ల ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఆయన పిలుపు ఇచ్చారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయించేందుకు న్యాయపోరాటం చేయాలని కూడా ఆయన అన్నారు. అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టడంలో దూకుడుగా వ్యవహరించాలని కాంగ్రెస్ నేతలకు దిశానిర్దేశం చేశారు. మంగళవారం తెలంగాణ పీసీసీ సమన్వయ భేటీలో ఆయన పాల్గొన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు న్యాయపోరాటం చేస్తూనే ఉంటామని చెప్పారు. వారిని రాజీనామా చేసేలా ఆ నేతల ఇళ్ల ముందు నిరసన చేపట్టాలని నిర్ణయించినట్టు తెలిపారు. పార్టీ ఫిరాయించిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ కార్పొరేటర్లపై అనర్హత వేటు వేయని కలెక్టర్లపైనా కోర్టులో కేసులు వేయాలని నిర్ణయించామని దిగ్విజయ్ వెల్లడించారు. ఇదిలావుంటే గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటుతామని మాజీ మంత్రి దానం నాగేందర్ అన్నారు. పార్టీ పటిష్టతతో పాటు మున్సిపల్ ఎన్నికలపైనా చర్చించామని అన్నారు. కాంగ్రెస్ మళ్లీ పుంజుకుంటుందని అన్నారు. పార్టీ మారిన వారిపై పోరాడుతామని అన్నారు.