ప్రతి ఒక్కరూ ఒక్కో మొక్క నాటాలి
మంత్రి సతీమణి పిలుపు
తిరుపతిజూలై7(జనం సాక్షి): ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి దానిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ఎం.అమరనాథ రెడ్డి సతీమణి రేణుకారెడ్డి అన్నారు. శనివారం పలమనేరు పట్టణంలో ఉన్న జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణంలో ఏర్పాటు చేసిన వనం మనం కార్యక్రమంలో భాగంగా…పండ్ల చెట్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చెట్లను పెంచడం వల్ల కాలుష్యాన్ని నివారించవచ్చన్నారు. చెట్లను పెంచడం వల్ల వర్షాలు సకాలంలో కురిసి పంటలు సస్యశ్యామలంగా పండుతాయన్నారు. పిల్లలు మొక్కలను చూసి స్వయంప్రతిపత్తితో ఎదగాలని ఆమె తెలిపారు. కాలుష్య రహిత సమాజం స్థాపించాలంటే ప్రతి ఒక్కరూ ఒక చెట్టును నాటి దానిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని ఆమె కోరారు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు కాబట్టి ప్రతి ఒక్కరు తమ వంతుగా చెట్లని పెంచే బాధ్యత అందరిపైనా ఉందని అన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటి అధ్యక్షులు హేమంత్ కుమార్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రామచంద్రయ్య, ఎంపిడిఒ హుర్మత్, మండల విద్యా శాఖాధికారి రామచంద్ర , పట్టణంలోని వార్డు కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
————–