ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయాలి-సీఎం కేసీఆర్‌

4
హైదరాబాద్‌, జనవరి 18(జనంసాక్షి): పల్స్‌పోలియో కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు ఆదివారం క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. చిన్న పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. తల్లిదండ్రులు ఏమాత్రం అశ్రద్ద చేయకుండా పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని కోరారు. వైద్య సిబ్బంది కూడా మారుమూల ప్రాంతాల్లో తిరిగి పిల్లలకు పోలియో చుక్కలు వేయాలని, ఏ ఒక్క చిన్నారినీ విస్మరించవద్దనీ సూచించారు. ఆదివారం నాటి పల్స్‌పోలియో కార్యక్రమం ముగిసిన తర్వాత కూడా ఇంకా ఎవరైనా మిగిలిపోయి వుంటే, ఆ చిన్నారులకు సోమవారం పోలియో చుక్కలు వేయాలని సీఎం కోరారు. ఇంటింటికి తిరగి మిగిలిపోయిన వారిని గుర్తించాలని చెప్పారు. ఉపముఖ్యమంత్రి డాక్టర్‌ రాజయ్య, పార్లమెంటరీ కార్యదర్శి శ్రీనివాస్‌ గౌడ్‌, ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాల చారి, వైద్య శాఖ కార్యదర్శి సురేష్‌చంద్‌, జిహెచ్‌ఎంసీ కమీషనర్‌ సోమేష్‌ కుమార్‌, హైదరాబాద్‌ కలెక్టర్‌ నిర్మల తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.