ప్రతి నీటు బొట్టు ఒడిసిపట్టాలి

4

– జలసంరక్షణ సమిష్టిబాధ్యత

– మన్‌కీబాత్‌లో ప్రధాని మోదీ

దిల్లీ,మే22(జనంసాక్షి):ప్రజల సూచనలు ప్రభుత్వ పాలనకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమం ద్వారా దేశ ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడారు. అడవుల పరిరక్షణ, జల సంరక్షణ అందరి బాధ్యతని స్పష్టం చేశారు. ప్రతి నోటిబొట్టును ఒడిసి పట్టాల్సిన అవసరం ఉందన్నారు. పర్యావరణ లోపమే అధిక ఉష్ణోగ్రతలకు కారణమవుతోందని ప్రధాని అన్నారు.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో కరవు ప్రభావం ఉన్నట్లు ప్రధానమంత్రి తెలిపారు. కరవు నివారణకు శాశ్వత పరిష్కారాల కోసం ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో నీరు-ప్రగతి, తెలంగాణలో మిషన్‌ భగీరథ కార్యక్రమాలతో నీటి సంరక్షణ చేపడుతున్నారని మోదీ కొనియాడారు. తక్కువ నీటితో సూక్ష్మసేద్యం వంటి విధానాలతో జలాన్ని సంరక్షించుకోవచ్చన్నారు.దేశవ్యాప్తంగా ప్రతి ఇంట్లోనూ బ్యాంకు ఖాతాదారులున్నారని మోదీ తెలిపారు. రాబోయే రోజుల్లో నగదు రహిత విధానంలోనే ఆర్థిక లావాదేవీలు జరగనున్నాయని స్పష్టం చేశారు. మొబైల్‌ ద్వారా ధన మార్పిడి చాలా సులువైన మార్గమన్నారు. ఏపీ, గుజరాత్‌ రాష్ట్రాలు టెక్నాలజీతో దూసుకుపోతున్నాయని కితాబిచ్చారు. ఒలింపిక్స్‌లో మన పతకాల పట్టిక చూస్తే మనకు బాధ కలుగుతుందని ప్రధాని అన్నారు. ఒక్క ఓటమితో క్రీడాకారులు కుంగిపోకూడదని… దాని నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగిపోవాలని సూచించారు.