ప్రతి పల్లెకు పక్కా రహదారి

3
– సీఎం కేసీఆర్‌ సమీక్ష

హైదరాబాద్‌,ఫిబ్రవరి 22(జనంసాక్షి): ప్రతీ గ్రామానికి ఖచ్చితంగా మంచి రహదారి ఉండేలా విధానపరమైన నిర్ణయం తీసుకున్నందున ఆ రోడ్లకు ప్రాధాన్యమివ్వాలని సీఎం కేసీఆర్‌ అధికారులకు సూచించారు. ఇవాళ ఆర్‌ అండ్‌ బీ శాఖపై సీఎం అధికారులతో పున:సవిూక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రోడ్లు, భవనాల శాఖ ద్వారా చేపట్టే నిర్మాణాలు ప్రజల అవసరాలకు తగ్గట్టుగా శాశ్వత ప్రాతిపదికన, భవిష్యత్‌ తరాలు కూడా ఉపయోగించుకునేలా ఉండాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత అంశాల్లో ఆర్‌అండ్‌బీ ద్వారా చేపట్టే రహదారుల నిర్మాణం కూడా ఉందన్నారు. ఆర్‌అండ్‌బీ శాఖ ద్వారా మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్‌ లేన్‌ రోడ్ల నిర్మాణాన్ని చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నదులు,ఉప నదులు, కాల్వలపై నిర్మించే బ్రిడ్జిలకు నిధులను కేటాయించే సమయంలో ఏ సంవత్సరంలో ఎంత పని జరుగుతుందో అంచనా వేసి ప్రతిపాదనలివ్వాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యం కల్పించడంతోపాటు సామూహిక అవసరాలకు తగినట్టు భవన నిర్మాణాలుండాలని సూచించారు. ఏడాదిలోగా రాష్ట్రవ్యాప్తంగా అన్నీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే కార్యాలయాలు నిర్మించాలని సూచించారు. ఆర్‌అండ్‌బీ శాఖ ద్వారా చేపట్టే పనులు రెండు మూడేళ్లు కూడా కొనసాగేవి ఉంటాయని.. ఏ సంవత్సరం ఎంత మేర పని అవుతుందో కూడా ముందే అంచనా వేసుకుని కార్యాచరణ రూపొందించాలని సూచించారు. నిర్మాణ పనుల్లో జరుగుతున్న జాప్యాన్ని నివారించాల్సిందిగా ఆదేశించారు. నిర్ణీత వ్యవధిలో నిర్మాణాలు చేపట్టిన వర్కింగ్‌ ఏజెన్సీలకు 1.5శాతం ఇన్సెంటివ్‌ ఇవ్వాలని తెలిపారు.