ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేస్తా
– మణిపూర్ సీఎంను అవుతా
– దీక్ష విరమించిన ఈరోమ్ షర్మిళ
ఇంఫాల్,ఆగస్టు 9(జనంసాక్షి):మణిపూర్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలన్నదే తన కోరిక అని ఉక్కుమహిళ ఇరోం షర్మిల ప్రకటించారు. 16 ఏళ్లుగా ఆమె చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షను ఇవాళ విరమించారు. మణిపూర్ రాజధాని ఇంఫాల్ లో విూడియా ముందు తేనె సేవించి షర్మిల దీక్ష విరమించారు. ఈ సందర్భంగా ఆమె ఉద్వేగానికి లోనయ్యారు. మాట్లాడేటప్పుడు కన్నీటిపర్యంతమయ్యారు. దీక్ష విరమించి క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తానని, పెళ్లి చేసుకుంటానని షర్మిల ఇప్పటికే ప్రకటించారు. ఐతే, తాను రాజకీయాల్లోకి రాకుండా కొన్ని అదృశ్య శక్తులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని షర్మిల చెప్పారు. కొన్ని రాడికల్ గ్రూపులు తాను రాజకీయాల్లోకి రావద్దని ఎందుకు బెదిరిస్తున్నాయో తనకు అర్థం కావడం లేదన్నారు. ఉక్కుమహిళగా తనకు ప్రజలు ఇచ్చిన గౌరవాన్ని కాపాడుకుంటానని స్పష్టం చేశారు.దీక్ష విరమించిన షర్మిలను పోలీసులు ముందుగా ఆస్పత్రి నుంచి కోర్టులో హాజరుపరిచారు. తన కేసును తానే వాదించుకున్న ఆమె, తనపై మోపిన కేసులన్నింటిని ఎత్తివేయాలని న్యాయమూర్తిని కోరారు. అయితే, తప్పు ఒప్పుకొంటేనే కేసులు ఎత్తివేస్తామని న్యాయమూర్తి స్పష్టం చేశారు. దీనిపై తదుపరి విచారణను ఆగస్టు 23కు వాయిదా చేసిన కోర్టు.. 10వేల రూపాయల వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేశారు.2000 సంవత్సరంలో అస్సాం రైఫిల్స్ జవాన్లు మణిపూర్ రాజధాని ఇంఫాల్ లో 10 మందిని కాల్చి చంపారు. ఈ ఘటనతో చలించిన షర్మిల అప్పటి నుంచే నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. అప్పటి నుంచి ఆమె ఆహారం ముట్టడం లేదు. ఆమెకు బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని ఉపసంహరించాలని షర్మిల డిమాండ్ చేస్తున్నారు. షర్మిల ఎంతగా పోరాడినప్పటికీ ప్రభుత్వం ఆమె డిమాండ్ పై సానుకూలంగా స్పందించ లేదు. అంతకుముందు ఇరోమ్ షర్మిల తన కేసును తానే వాదించుకున్నారు. మంగళవారం ఇంఫాల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముందు ఆమె హాజరు అయ్యారు. 16 ఏళ్లుగా అఫ్సా చట్టానికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేస్తున్న ఆమె కోర్టు ముందుకు వచ్చారు. తన విూద నమోదైన కేసులను ఎత్తివేయాలని ఆమె డిమాండ్ చేశారు. దీక్షా విరమణ చేయాలనుకున్న షర్మిలను ఉదయం పోలీసులు పూర్తి భద్రత మధ్య హాస్పటల్ నుంచి కోర్టుకు తరలించారు. నిరాహార దీక్ష చేస్తున్న షర్మిల అనేక సార్లు ఆత్మాహత్య యత్నానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. దాంతో ఆమె ప్రయత్నాలను అడ్డుకునేందుకు పోలీసులు అనేకసార్లు గతంలో ఆమెను అరెస్టు చేశారు. దీక్ష విమరణ తర్వాత రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న షర్మిలకు మెజిస్ట్రేట్ బెస్ట్ లక్ చెప్పారు. మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉక్కు మహిళ షర్మిల స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్నారు. కేసు విచారణ సందర్భంగా ప్రాసిక్యూటర్ కొందరు సాక్షుల్ని ప్రశ్నించారు. ఆహారం తీసుకోకుండా ఓ వ్యక్తి 15 ఏళ్లు జీవించే అవకాశం ఉందా అని ప్రాసిక్యూటర్ కొందరు సాక్షులను ప్రశ్నించారు. చట్టం సాకుతో తనను తప్పుడు పద్ధుతుల్లో అరెస్టు చేయడం సరికాదని షర్మిల కోర్టు ముందు వాదించారు.
నేరాంగీకరణకు నిరాకరణ
మణిపూర్‌లో సాయుధ బలగాల ప్రత్యేక అధికారల చట్టానికి వ్యతిరేకంగా 16ఏళ్లుగా చేపట్టిన నిరాహార దీక్ష విరమించిన ఉక్కు మహిళ ఇరోమ్ చాను షర్మిలాకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. పూచీకత్తు కింద రూ.10వేల వ్యక్తిగత బాండ్ సమర్పించాలని మెజిస్ట్రేట్ షర్మిలాను ఆదేశించారు. దీక్ష విరమించిన షర్మిలా జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరై వాదనలు వినిపించారు. తాను ఏ నేరమూ చేయలేదని.. తనపై నమోదైన కేసులన్నీ ఎత్తివేయాలని కోకారు. అయితే తప్పు ఒప్పుకుంటేనే కేసులు ఎత్తివేస్తామని న్యాయమూర్తి స్పష్టం చేశారు. మణిపూర్ ఉక్కు మహిళగా పేరుపొందిన ఇరోమ్ షర్మిల తాను సుదీర్ఘ కాలంగా చేస్తోన్న దీక్ష విరమించారు. ఈ రోజు నుంచి తాను దీక్షను విరమిస్తున్నట్టు ప్రకటించారు. ఈమేరకు మంగళవారం ఆమె విలేకరుల సమావేశంలో ఉద్వేగభరితంగా మాట్లాడారు. తాను మణిపూర్ సీఎం కావాలనుకుంటున్నట్టు మనసులోని మాటను బయటపెట్టారు. మణిపూర్ ప్రజలు పిలుచుకుంటున్నట్టు తాను ఉక్కు మహిళగానే బతుకుతానని వెల్లడించారు. తాను రాజకీయాల్లోకి రావడాన్ని కొన్ని రాడికల్ గ్రూప్స్ ఎందుకు వ్యతిరేకిస్తున్నాయో తనకు అర్థం కావడంలేదన్నారు. కాగా, సైనిక బలగాల ప్రత్యేక హక్కుల చట్టంను వ్యతిరేకిస్తూ గత పదహారేళ్లుగా ఆమె నిరాహార దీక్ష చేస్తోన్న విషయం తెలిసిందే. తాను ఆగస్టు 9న దీక్ష విరమించనున్నట్టు షర్మిల గతంలో ప్రకటించారు. ఈమేరకు ఆమెను పోలీసులు ఆమెకు చికిత్స అందిస్తున్న ఆస్పత్రి నుంచి కోర్టుకు తీసుకొచ్చారు. తనపై మోపిన కేసులన్నింటిని ఎత్తివేయాలని ఆమె న్యాయమూర్తిని కోరారు. నిరాహార దీక్ష సందర్భంగా ఆమె ఆత్మహత్యకు పలుమార్లు యత్నించినట్టు ఆమెపై ఆరోపణలున్నాయి.