ప్రధానితో నేడు కాశ్మీర్ విపక్షనేతల భేటీ
న్యూఢిల్లీ,ఆగస్టు 21(జనంసాక్షి):కశ్మీరులో అల్లకల్లోలం నేపథ్యంలో జమ్మూ-కశ్మీరు ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సోమవారం సమావేశం కాబోతున్నారు. ప్రతిపక్ష నేతల బృందానికి ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా నేతృత్వం వహిస్తారు. అందరు భాగస్వాములతోనూ చర్చలు ప్రారంభించి, సంక్షోభానికి రాజకీయ పరిష్కారం కనుగొనాలని ఈ నేతలు కోరుతారు. కశ్మీరులో క్షేత్ర స్థాయి పరిస్థితులను వీరు వివరిస్తారు. ఉగ్రవాది బుర్హాన్ వనీ ఎన్‌కౌంటర్, కర్ఫ్యూ నేపథ్యంలో కశ్మీరీల దయనీయ పరిస్థితులను తెలియజేస్తారు.ప్రతిపక్ష నేతల బృందంలో నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లాతో పాటు సీపీఎం ఎమ్మెల్యే మహ్మద్ యూసఫ్ తరిగామి, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు జీఏ మిర్, నేషనల్ కాన్ఫరెన్స్ సీనియర్ నేతలు, స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉంటారు. ప్రస్తుత పరిస్థితులను పరిపాలనాపరమైన చర్యల ద్వారా ఎదుర్కొనడాన్ని ఆపాలని మోదీకి చెప్పబోతున్నట్లు ఈ బృందంలోని కొందరు నేతలు చెప్పినట్లు సమాచారం. పరిపాలనాపరంగా చర్యలు తీసుకోవడం వల్ల కశ్మీరీల్లో, ముఖ్యంగా యువతలో మరింత వ్యతిరేకత వస్తుందని వివరిస్తారని తెలుస్తోంది.