ప్రధానిని కలిసిన కేజ్రీవాల్
ప్రమాణ స్వీకారానికి రాలేను:మోదీ
దిల్లీ డిప్యుటీ సీఎంగా శిసోడియా!
న్యూఢిల్లీ,ఫిబ్రవరి12(జనంసాక్షి): దిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆప్ అధినేత అరవింద్ కేజీవ్రాల్ గురువారం ఉదయం ప్రధాని నరేంద్రమోదీని మర్యాద పూర్వకంగా కలిశారు. దిల్లీ సమస్యల పరిష్కారానికి సహకరించాలని ఈ సందర్భంగా కేజీవ్రాల్ ప్రధానిని కోరారు. ఈనెల 14న జరిగే తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరుకావాలని ప్రధానిని ఆహ్వానించారు. అలాగే వివిధ అంశాలను వీరిద్దదూ చర్చించారు. కేజ్రీవాల్‌కు ప్రధాని అభినందనలు తెలిపారు. ప్రధానితో భేటీ అనంతరం ఆప్ సీనియర్‌నేత మనీష్ సిసోడియా విూడియాతో మాట్లాడుతూ… ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల కారణంగా… ప్రమాణస్వీకార కార్యక్రమానికి మోదీ హాజరు కావడంలేదని తెలిపారు. వారిద్దరి మధ్య చర్చలు సామరస్య పూర్వకంగానే జరిగినట్లు ఆయన వెల్లడించారు. అయితే ఫిబ్రవరి 14వ తేదీన ఆప్ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి మోదీ హాజరుకావడం లేదని ఆయన తెలిపారు. ఆ రోజు ప్రధానికి వేరే ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నందున ఆయన హాజరు కాలేకపోతున్నట్లు ప్రధాని కేజీవ్రాల్ కు స్పష్టం చేశారని సిసోడియా పేర్కొన్నారు. కాగా కేజీవ్రాల్ బుధవారం కేంద్రమంత్రులతో పాటు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసిన విషయం తెలిసిందే. కాగా సరిగ్గా ఏడాది క్రితం రాజీనామా చేసిన రోజునే అరవింద్ కేజీవ్రాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా రెండోసారి ఫిబ్రవరి 14న ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కనీవిని ఎరుగని రీతిలో జాతీయ పార్టీలను మట్టికరిపించిన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటుకు భారీస్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక కాబోయే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజీవ్రాల్ అస్వస్థతకు గురయ్యారు. కేజీవ్రాల్ దగ్గు, జ్వరంతో బాధపడుతుండటంతో పూర్తిగా విశ్రాంతి అవసరమని ఆయనకు వైద్యులు సూచించారు. అస్వస్థత కారణంగా కేజీవ్రాల్ నివాసం నుంచే కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు.
ఇక ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత మనీష్ సిసోడియాకు ఆపార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజీవ్రాల్ కీలక బాధ్యతలు అప్పగించనున్నారు. పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ.. తాజా ఎన్నికల్లో ఆప్ గెలుపునకు కృషి చేసిన ఆయనకు డిప్యూటీ సీఎం బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. అరవింద్ కేజీవ్రాల్తో కలిపి 11 మందితో కేబినెట్ ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం కేబినెట్లో ఎవరెవరు ఉంటారనే దానిపై సర్వత్రా చర్చ సాగుతోంది. కొత్తగా ఏర్పడే కేబినెట్లో పాత మంత్రులు ముగ్గురికి చోటు లభించే అవకాశం ఉంది. సత్యేంద్ర జైన్, సౌరభ్ భరద్వాజ్ తిరిగి కేబినెట్లోకి వచ్చే అవకాశం ఉంది. రాఖీ బిద్లాన్లు, గిరీశ్ సోనీ, సోమ్నాథ్ భారతీలకు కేబినెట్‌లో చోటు దక్కకపోవచ్చునని భావిస్తున్నారు.