ప్రధాని ఇంటివైపు దూసుకెళ్లిన సిక్కులు

న్యూఢిల్లీ,మే 5 (జనంసాక్షి) :  1984 నాటి సిక్కు వ్యతిరేక దాడుల కేసులో కాంగ్రెస్‌ నేత సజ్జన్‌ కుమార్‌ విడుదలపై సిక్కులు రగిలిపోతున్నారు. ఆదివారం ఢిల్లీలో సిక్కులు పెద్దసంఖ్యలో ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ప్రధానికి తమ నిరసనను తెలియజేసేందుకు వీరంతా ఆయన అధికార నివాసమార్గంలో ఉన్న బారికేడ్లను విరగ్గొట్టి మరీ దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఆందోళనకారులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ ప్రధాని నివాసమున్న 7, రేస్‌కోర్స్‌ రోడ్‌ వైపు వస్తుండగా పార్లమెంటు స్ట్రీట్‌ పోలీస్‌స్టేషన్‌ వద్ద పోలీసులు అతి కష్టం మీద వారిని నిలువరించారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అక్టోబర్‌ 31, 1984న అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హత్యానంతరం సిక్కులే లక్ష్యంగా జరిగిన దాడులలో బాధితులకు న్యాయం చేయాలని, నిందితుడైన సజ్జన్‌కు కఠిన శిక్ష విధించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద శుక్రవారం నుంచి సిక్కులు నిరసనలు, నిరాహారదీక్షలు చేపట్టారు.