ప్రపంచ జనాభా దినోత్సవ ర్యాలీకి ఎజెసి పచ్చజెండా
విజయనగరం, జూలై 11 : ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యాన బుధవారం నాడు ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ఈ సేవా కేంద్ర వద్ద ఈ ర్యాలీకి జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ రామారావు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చిన్న కుటుంబం అన్ని సంతోషాలకు ఆధారం అనే నినాదంతో ఈ జనాభా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చట్ట ప్రకారం స్త్రీ వివాహ వయస్సు 21 సంవత్సరాలు, పురుషుని వివాహ వయస్సు 25 సంవత్సరాలుగా నిర్దేశించినట్లు తెలిపారు. ర్యాలీలో వివిధ ఆసుపత్రులు, శిక్షణా కేంద్రాలకు చెందిన వైద్య సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో జనాభా దినోత్సవ సదస్సు నిర్వహించారు.