ప్రపంచ ధనిక దేశాల జాబితాలో భారత్‌ ఆరోస్థానం

న్యూదిల్లీ(జ‌నం సాక్షి): ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశాల జాబితాలో 8,230 బిలియన్‌ డాలర్లతో భారత్‌ ఆరోస్థానంలో నిలిచింది. ఇక ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశంగా అగ్ర రాజ్యం అమెరికా మొదటిస్థానంలో ఉన్నట్లు తాజా నివేదిక ఒకటి వెల్లడించింది. అఫ్రేషియా బ్యాంకు చేసిన గ్లోబల్‌ వెల్త్‌ మైగ్రేషన్‌ రివ్యూ ప్రకారం 62,584 బిలియన్‌ డాలర్లతో అమెరికా ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశంగా అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాత 24,803 బిలియన్‌ డాలర్లతో చైనా రెండో స్థానంలో… 19,522 బిలియన్‌ డాలర్లతో జపాన్‌ మూడో స్థానంలో ఉన్నాయి.

‘మొత్తం సంపద’ అంటే దేశంలో నివశించే ప్రతి వ్యక్తి సంపదను పరిగణనలోకి తీసుకున్నట్లు నివేదిక తెలిపింది. స్థిరాస్తి, నగదు, ఈక్విటీలు, వ్యాపారాలను ఇలా ప్రతి దానిని సంపదగా లెక్కించారు. అయితే ప్రభుత్వ ఆస్తులను ఇందులో గణించలేదు.

అమెరికా, చైనా, జపాన్‌ల తర్వాత యూకే(9,919 బిలియన్‌ డాలర్లు), జర్మనీ (9,660 బిలియన్‌ డాలర్లు), భారత్‌(8,230 బిలియన్‌ డాలర్లు), ఆస్ట్రేలియా (6,142 బిలియన్‌ డాలర్లు), కెనడా (6,393 బిలియన్‌ డాలర్లు) ఫ్రాన్స్‌ (6,649 బిలియన్‌ డాలర్లు), ఇటలీ (4,276 బిలియన్‌ డాలర్లు)లు మొదటి పది స్థానాల్లో ఉన్నాయి. సంపద సృష్టికి అనేక అంశాలు దోహద పడ్డాయని అఫ్రేషియా బ్యాంకు వెల్లడించింది. పదేళ్ల సంపద వృద్ధి గణాంకాలను పరిగణనలోకి తీసుకోగా, వ్యాపారాలు పెరగడం, చక్కని విద్యావ్యవస్థ, ఐటీ రంగంలో అభివృద్ధి, ఔట్‌ సోర్సింగ్‌, స్థిరాస్తి, హెల్త్‌కేర్‌, మీడియా రంగాల్లో 200శాతం వృద్ధిని నమోదు చేసినట్లు నివేదిక వెల్లడించింది.

ఇక వచ్చే దశాబ్దకాలంలో అభివృద్ధిలో చైనా దూసుకుపోతుందని, 2027 నాటికి సంపద 69,449 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని అంచనా వేసింది. ఇక అమెరికా సంపద 75,101 బిలియన్‌ డాలర్లుకు చేరుతుందని పేర్కొంది. ప్రపంచంలో ప్రైవేటు వ్యక్తుల మొత్తం సంపద 215 ట్రిలియన్‌ డాలర్లని నివేదిక తెలిపింది. ప్రపంచంలో మొత్తం 5,84,000మంది మల్టీ మిలియనీర్లు ఉండగా, వారి సగటు ఆస్తుల విలువ 10 మిలియన్‌ డాలర్లని వెల్లడించింది. కాగా, ప్రపంచవ్యాప్తంగా 2,252మంది బిలియనీర్లు ఉన్నారు.

వచ్చే పదేళ్లలో సంపదలో కెనడా, జర్మనీ, యూకేలను ఆస్ట్రేలియా దాటుకెళ్తుందని తెలిపింది. అదే సమయంలో జర్మనీని భారత్‌ అధిగమించే అవకాశం ఉందని పేర్కొంది. ఇక ప్రపంచ సంపద మరో 50శాతం పెరుగుతుందని అంచనా వేసింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో శ్రీలంక, భారత్‌, వియత్నాం, చైనా, మారిషస్‌ ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.