ప్రభుత్వానికి ఢోకా లేదు: బొత్స

మజ్లిస్‌తో చర్చిస్తామన్న పీసీసీ చీఫ్‌

హైదరాబాద్‌, నవంబర్‌ 12 (ఆర్‌ఎన్‌ఏ): ఎంఐఎం మద్దతు ఉపసంహరించుకున్నా తమ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. శాంతిభద్రతల విషయంలో రాజీ పడేది లేదన్నారు. మతతత్వ శక్తులను ప్రోత్సహించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ప్రభుత్వంపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ చేసిన వ్యాఖ్యలను ఆయన తోసిపుచ్చారు. పాతబస్తీ విషయంలో తాము ఎవరికీ మద్దతు ఇవ్వలేదని పేర్కొన్నారు. శాంతిభద్రతల విషయంలో అన్ని ప్రభుత్వాలు ఎలా వ్యవహరిస్తాయో తాము అలాగే అవ్యవహరించామని చెప్పారు. ఎంఐఎం మద్దతు ఉపసంహరణ నేపథ్యంలో బొత్స సోమవారం సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని క్యాంపు కార్యాలయంలో కలిశారు. మద్దతు ఉపసంహరణ, తర్వాతి పరిణామాలపై చర్చించారు. సీఎంతో భేటీ అనంతరం బొత్స విూడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎంఐఎం మద్దతు ఉపసంహరించడాన్ని ఆయన తేలిగ్గా కొట్టిపడేశారు. ఎంఐఎం నిర్ణయంతో ప్రభుత్వానికి ఎలాంటి ముప్పు లేదన్నారు. 2014 వరకు కాంగ్రెస్‌ సర్కారు కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణకే తమ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని బొత్స చెప్పారు. పాతబస్తీ ఘటన విషయంలో తమ మద్దతు ఎవరికీ లేదన్నారు. ప్రభుత్వంపై ఒవైసీ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. మద్దతు ఉపసంహరణ విషయం చాలా చిన్నదన్నారు. ఆ పార్టీ నేతలతో సంప్రదింపులు జరుపుతామన్నారు. పరిస్థితిని మజ్లిస్‌ నేతలు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. శాంతిభద్రతల విషయంలో అన్ని ప్రభుత్వాలు వ్యవహిరించినట్లే తాము వ్యవహరించామని తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో శాంతిభద్రతలో విషయంలో రాజీ లేదన్నారు. ఎవరూ ఆవేశానికి లోనుకావద్దని కోరారు.