ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు విపక్షాల కుట్ర

యూపీఏ చైర్‌ పర్సన్‌ సోనియా
సూరత్‌ఘర్‌, జూన్‌ 20 (జనంసాక్షి) :
యూపీఏ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు విపక్షాలు కుట్ర పనుతున్నాయని యూపీఏ చైర్‌ పర్సన్‌ సోనియాగాంధీ అన్నారు. శ్రీగంగానగర్‌ జిల్లాలోని సూరత్‌ఘర్‌లో నిర్మించనున్న థర్మల్‌ క్రిటికల్‌ పవర్‌ స్టేషన్‌ నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేశారు. 660 మెగావాట్ల సామర్థ్యమున్న రెండు పవర్‌ ప్లాంట్ల నిర్మాణానికి రూ.7,920 కోట్లు కేటాయించామని తెలిపారు. నాగౌర్‌ జిల్లాలో తాగునీటి సరఫరాకు రూ.2,938 కోట్లతో జయాల్‌ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సోనియాగాంధీ మాట్లాడుతూ, దేశ ప్రజలకు సుపరిపాలన అందిస్తున్న యూపీఏ ప్రభుత్వాన్ని ఎలగైనా అస్థిర పరచాలని విపక్షాలు అనేక కుట్రలు కుతంత్రాలకు పాల్పడుతున్నాయని తెలిపారు. ప్రజల సంక్షేమాన్ని విస్మరించిన విపక్షాలు ఎంతసేపు అధికార పీఠాన్ని అందుపుచ్చుకోవాలనే ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ఆయా పక్షాల కుట్రలను సమర్థవంతంగా తిప్పుకొడుతున్నామన్నారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి అశోక్‌గెహ్లాట్‌, విద్యుత్‌ శాఖ మంత్రి జితేంద్రసింగ్‌ తదితరులు పాల్గొన్నారు.