ప్రభుత్వాలు మారినప్పుడల్లా ప్రతికూల పరిస్తితులు


గుర్జీత్‌ సింగ్‌ పిటిషన్‌ విచరన సందర్బంగా సిజె వ్యాఖ్యలు
న్యూఢల్లీి,ఆగస్ట్‌26((జనంసాక్షి)): అధికార పార్టీతో అంటకాగే పోలీసు అధికారులు తదనంతర కాలంలో ప్రత్యర్థి పార్టీ అధికారంలోకి వచ్చినపుడు ప్రతికూల పరిణామాలను ఎదుర్కొంటున్నారని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ అన్నారు. సస్పెండయిన అడిషినల్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ గుర్జిందర్‌ పాల్‌ సింగ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్‌ రమణ మౌఖికంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఛత్తీస్‌గఢ్‌ అడిషినల్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ గుర్జిందర్‌ పాల్‌ సింగ్‌పై దేశ ద్రోహం కేసు నమోదైంది. ఆయన సస్పెన్షన్‌కు గురయ్యారు. ఈ కేసును రద్దు చేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై సీజేఐ జస్టిస్‌ రమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌ ధర్మాసనం విచారణ జరిపింది. జస్టిస్‌ రమణ మాట్లాడుతూ, దేశంలో పరిస్థితులు చాలా విచారకరంగా ఉన్నాయన్నారు. ఓ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నపుడు పోలీసు అధికారులు ఓ పార్టీ పక్షం వహిస్తే, ఆ తర్వాత మరొక కొత్త పార్టీ అధికారంలోకి వస్తే, ఆ పోలీసు అధికారులపై ఆ కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఇది కొత్త రకం ధోరణి అని పేర్కొన్నారు. దీనిని ఆపాలన్నారు. గుర్జిందర్‌ పాల్‌ సింగ్‌ పిటిషన్‌పై స్పందిస్తూ, ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. ఆయనను నాలుగు వారాలపాటు అరెస్టు చేయరాదని ఆదేశించింది. సింగ్‌ తరపున సీనియర్‌ అడ్వకేట్‌ ఫాలీ ఎస్‌ నారిమన్‌, ప్రభుత్వం తరపున సీనియర్‌ అడ్వకేట్‌ ముకుల్‌ రోహత్గి వాదనలు వినిపించారు. సింగ్‌ అక్రమాస్తులు కూడబెట్టారని ఫిర్యాదులు రావడంతో యాంటీ కరప్షన్‌ బ్యూరో (ఏసీబీ), ఆర్థిక నేరాల విభాగం ఆయనపై జూన్‌ 29న కేసు నమోదు చేసింది. ఆయన నివాసంలో జూలై 1న సోదాలు చేసి, ఆయనపై పోలీసులు రాజద్రోహం కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 124ఏ, 153ఏ ప్రకారం నేరాలకు పాల్పడినట్లు ఆరోపించారు.