ప్రభుత్వ నేతలూ వివరించండి..

 

రాఫెల్‌ యుద్ధ విమానాల ధరల పెరుగుదలపై చిదంబరం విమర్శలు

కోల్‌కతా,ఆగస్టు25(జ‌నం సాక్షి ): రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం విషయంలో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం మరోసారి విమర్శలు గుప్పించారు. ఆ ఒప్పందంపై ప్రశ్నలు అడిగితే ప్రభుత్వం దాటివేత ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈ ఒప్పందం విషయంలో కేంద్ర మంత్రి వర్గం సరైన విధంగా వ్యవహరించట్లేదని ఆరోపించారు. ఈ రోజు ఆయన విూడియాతో మాట్లాడుతూ… ‘రాఫెల్‌ యుద్ధ విమానాల ఒప్పందం చేసుకునేటప్పుడు రక్షణ పరంగా జరపాల్సిన పక్రియను ఎందుకు జరపలేదు? అలాగే, ఒప్పంద ప్రక్రియ జరిపే కమిటీతో పాటు ధర విషయాలపై చర్చలు జరిపే కమిటీలను గురించిన వివరాలను ఎందుకు దాచిపెడుతున్నారు?’ అని ప్రశ్నించారు.రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో యూపీఏ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందానికి, ప్రస్తుత ఎన్డీఏ సర్కారు చేసుకున్న ఒప్పందానికీ చాలా తేడా ఉందని చిదంబరం విమర్శించారు. ‘ఒక్కో యుద్ధ విమానానికి యూపిఎ ప్రభుత్వం రూ.526 కోట్లతో ఒప్పందం చేసుకుంది. కానీ, ఎన్డీఏ ఒక్కో యుద్ధ విమానాన్ని రూ.1,670 కోట్ల చొప్పున కొనుగోలు చేస్తోంది. ధరలు ఇంతగా పెంచడానికి కారణాలేంటో ప్రభుత్వ నేతలు ఎవరయినా వివరిస్తారా?’ అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, 1984 సిక్కుల ఊచకోతపై కొందరు ఇటీవల చేసిన విమర్శలపై ఆయన స్పందిస్తూ… ‘1984లో కాంగ్రెస్‌ అధికారంలో ఉంది. ఆ సమయంలో జరిగిన అల్లర్లు చాలా బాధాకరం. ఆ విషయంపై మన్మోహన్‌ సింగ్‌ పార్లమెంటులో క్షమాపణలు కూడా చెప్పారు. ఆ ఘటనపై రాహుల్‌ గాంధీపై విమర్శలు ఎలా చేస్తారు? ఆ సమయంలో రాహుల్‌కి 14 ఏళ్లు మాత్రమే’ అని చిదంబరం వ్యాఖ్యానించారు.