ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి 

– ప్రతికూల పరిస్థితుల్లోనూ 10.5వృద్ధిరేటు సాధించాం
– డిసెంబర్‌ నాటికి వందశాతం ఓడీఎఫ్‌ పూర్తి కావాలి
– ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
అమరావతి,  జులై7(జ‌నం సాక్షి) : వచ్చే ఆరు నెలల అభివృద్ధి లక్ష్యాల సాధనకు విభాగాధిపతులు, కార్యదర్శులు కృషి చేయాలని ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. శనివారం ఉదయం విభాగాధిపతులు, కార్యదర్శులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నత స్థాయి సవిూక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. 15శాతం వృద్ధి రేటు లక్ష్యంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ఒనగూరిన ప్రయోజనాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్దేశించారు. ఆరు నెలల కార్యాచరణ ప్రణాళిక అమలుపై దిశానిర్దేశం చేశారు. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లోనూ అధికారులు, సిబ్బంది సహకారంతో మూడేళ్లుగా 10.5 వృద్ధి రేటు సాధించామని చెప్పారు. డిసెంబర్‌ నాటికి వంద శాతం ఓడీఎఫ్‌ పూర్తి కావాలని లక్ష్య నిర్దేశం చేశారు. సంక్షేమంలో అత్యధిక సంతృప్తి సాధించామని, పరిష్కార వేదిక ద్వారా రియల్‌ టైంలో సమస్యలు పరిష్కరిస్తున్నామని సీఎం గుర్తు చేశారు. పథకాల అమలు, సంక్షేమంలో 90 శాతం సంతృప్తి సాధించడమే లక్ష్యం అన్నారు.