ప్రభుత్వ లాంఛనాలతో రామానాయుడు అంత్యక్రియలు
సీఎం కేసీఆర్ ఘన నివాళి
హైదరాబాద్,ఫిబ్రవరి19(జనంసాక్షి): మూవీ మొఘల్ రామానాయుడు అంత్యక్రియలు అధికార లాంఛనాలతో ముగిశాయి. సినీ దిగ్గజానికి చిత్రపరిశ్రమ అశ్రునయనాలతో తుది వీడ్కోలు పలికింది. అంతిమ సంస్కార కార్యక్రమానికి వేలాదిగా అభిమానులు, ప్రముఖులు హాజరయ్యారు. పెద్దదిక్కును కోల్పోయిన పరిశ్రమ సభ్యులంతా రామానాయుడు స్టూడియోకు చేరుకుని విషణ్ణ వదనాలతో అంతిమ సంస్కార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రామానాయుడు కుమారులు సురేశ్, వెంకటేశ్, మనవలు రాణా, నాగచైతన్య తదితరులు అంతిమ సంస్కార కార్యక్రమాలు నిర్వహించారు. పెద్ద కుమారుడు సురేశ్ తండ్రి చితికి నిప్పంటించారు. దక్షిణాది చలనచిత్ర పరిశ్రమవారే కాక బాలీవుడ్‌నుంచి కూడా ప్రముఖులు తరలివచ్చారు. పలువురు రాజకీయ నాయకులు హాజరయ్యారు. స్వగ్రామం కారంచేడు నుంచి భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలమేరకు పోలీసులు గౌరవసూచకంగా గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి అధికార లాంఛనాలు నిర్వహించారు. రామానాయుడు పార్థివదేహానికి చివరిసారిగా నివాళులర్పించేందుకు చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. రామానాయుడు అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరిగాయి. అశ్రునయనాల మధ్య ఆయనకు పలువురు శ్రద్ధాంజలి ఘటించారు. రామానాయుడు అంత్యక్రియలకు ఆయన అభిమానులు భారీగా తరలిరావడంతో స్టూడియో కిక్కిరిసిపోయింది. రామానాయుడితో ఉన్న అనుంబంధాన్ని సినీప్రముఖులు గుర్తు చేసుకున్నారు. సినీ పరిశ్రమలో పెద్ద దిక్కును కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. హిందీ నటుడు అనల్ కపూర్, నిర్మాత బోనీకపూర్ తో పాటు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాన సినీటోమాగ్రఫీ మంత్రి తలసాని, బాబూ మోహన్ తదితరులు పాల్గొన్నారు. రామానాయుడు క్యాన్సర్ తో బాధపడుతూ మృతి చెందిన విషయం విదితమే.
సీఎం కేసీఆర్ నివాళి-
ప్రముఖ సినీ నిర్మాత రామానాయుడు భౌతికకాయాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సందర్శించి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. తెలంగాణ మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎంపీ కె.కేశవరావు, తదితరులు రామానాయుడు భౌతికకాయానికి నివాళులర్పించారు. సినీరంగానికి ఎనలేని కృషి చేసిన ప్రముఖ నిర్మాత రామానాయుడికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు ఆదేశాలు ఇచ్చారు. రామానాయుడు పార్థీవ దేహాన్ని కడసారి చూసేందుకు అభిమానులు, సినీ ప్రముఖులు భారీగా తరలివచ్చారు.తెలుగు చలనచరిత్రలో రామానాయుడిది మరిపోలేని చరిత్ర అని నటుడు కృష్ణ అన్నారు. గురువారం రామానాయుడు స్టూడియోలో పార్థివదేహాన్ని కృష్ణ సందర్శించి నివాళిఅర్పించారు. రామానాయుడితో మండేగుండెలు, ముందడుగు, సాహసగాళ్లు సినిమాలు చేశానని కృష్ణ గుర్తుచేసుకున్నారు. రామానాయుడితో కలిసి పనిచేయడం గొప్ప అవకాశంగా భావిస్తున్నామని నటి జయప్రద అన్నారు. రామానాయుడు గొప్పనిర్మాత అని ఆమె కొనియాడారు.రామానాయుడు స్టూడియోలో ఎక్కడ చూసినా చెమ్మగిల్లిన నయనాలు..మౌనవేదనతో కరువైన మాటలు…ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని పలువురు పేర్కొన్నారు.