ప్రమాదస్థాయికి సుల్తానాబాద్ పెద్ద చెరువు
పెద్దపల్లి,జూలై13(జనంసాక్షి): భారీ వర్షాల కారణంగా మానేరు నది పరివాహక ప్రాంతాలలో పంట పొలాలు నీటమునిగాయి. ఇళ్లలోకి వర్షం నీరు వచ్చి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వర్షం ధాటికి పలు పెంకుటిల్లు నేలమట్టమయ్యాయి. వరద నీటి ప్రవాహంతో సుల్తానాబాద్ పెద్ద చెరువు ప్రమాద స్థాయికి చేరింది. దీంతో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేసారు. సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాల కారణంగా
దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో గేట్లను ఎత్తివేస్తున్నారు. దిగువ ప్రాంతాల్లో ఉన్న గ్రామాలు నీట చిక్కుకున్నాయి. జనజీవనం స్తంభించిపోయింది. పలు ప్రాంతాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. గోదావరి నది ఉగ్రరూపం దాలుస్తోంది. ఇంతకుముందెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో వరద నీరు పోటెత్తడంతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. నీటి ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతోంది. నిన్న 5 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉంటే.. ప్రస్తుతానికి 9 లక్షల 75 వేల క్యూసెక్కుల వరకు చేరుకుంది. గోదావరి ఉపనదులైన ప్రాణహిత, ఇంద్రావతి, మానేరు నుంచి వరద పోటెత్తుతోంది. వరద నీరు వచ్చి చేరుతుందని.. ముందే జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలోని పలు కాలనీలు ముంపునకు గురయ్యాయి. అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాలు జల దిగ్భందంలో చిక్కుకున్నాయి. వరద నీరు వచ్చి చేరడంతో ఇంట్లో ఉన్న సామాగ్రీ తడిసిపోయిందని పలువురు వెల్లడిరచారు. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. మాతా శిశు సంరక్షణ కేంద్రం చుట్టూ వరద నీరు వచ్చి చేరింది. గోదావరిలో వరద పెరుగుతుండటంతో వెంటనే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి భోజనం, వసతి సౌకర్యాలు ఏర్పాట్లు చేయాలని జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు.