ప్రముఖ సంగీత దర్శకులు చక్రి ఇక లేరు

6

మూగబోయిన సిని కళామ తల్లి

అభిమానుల కన్నీటి వీడ్కోలు

తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రగాఢ సంతాపం

 

హైదరాబాద్‌,డిసెంబర్‌15(జనంసాక్షి): తెలుగు చలనచిత్ర పరిశ్రమ మరో ఆణిముత్యాన్ని కోల్పోయింది. యువసంగీత దర్శకుడు, స్వర మాంత్రికుడు చక్రి గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. తెలంగాణ నుంచి వచ్చిన చక్రి చిత్రసీమలో నిలదొక్కుకుని అందరి ఆదరాభిమానాలు పొందిన వ్యక్తిగా పేరొందిన చక్రి మృతితో తెలుగు సినీకళామతల్లి మూగపోయింది. సోమవారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో చక్రిని ఆయన కుటుంబసభ్యులు అపోలో ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలో చికిత్స పొందుతూ చక్రి తుదిశ్వాస విడిచారు. చక్రి పూర్తిపేరు జిల్లా చక్రధర్‌. ఆయన స్వస్థలం వరంగల్‌ జిల్లా మహబూబాబాద్‌ మండలం కంబాలపల్లి. 85 సినిమాలకు సంగీతం అందించిన చక్రి సత్యం సినిమాకు ఉత్తమ గాయకుడిగా ఫిలింఫేర్‌ అవార్డు అందుకున్నారు. ఎన్నో అత్యుత్తమ సినిమాలకు సంగీతం అందించిన చక్రి బాచి సినిమాతో తెలుగుతెరకు పరిచయం అయ్యారు. సింహా సినిమాకు నంది అవార్డు వరించింది. 1974 జూన్‌ 15న జన్మించిన చక్రి.. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో వచ్చిన బాచి సినిమాతో సంగీత దర్శకుడిగా తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆయన చివరి సినిమా దాసరి నటించిన ‘ఎర్రబస్సు’. ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’, ‘అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు..’, ‘అమ్మనాన్న ఓ తమిళ అమ్మాయి’, ‘ఇడియట్‌’, ‘దేశముదురు’, ‘సత్యం’, ‘గోపి గోపిక గోదావరి’, ‘సింహా’.. తదితర సినిమాలకు సంగీత దర్శకత్వం వహించి హిట్‌ పాటలను అందించారు. గాయకుడిగా కూడా చక్రి మంచి పేరును సంపాదించుకున్నారు. ఎందరో గాయనీగాయకులను తెలుగు సినిమాకు పరిచయం చేశారు. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది అని పాడినా. ఓ మగువా నీతో స్నేహం కోసం. చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే. అమ్మపై పాడిన నీవే నీవే, ఇలా ఎన్నో పాటలతో… తన ఎంతో మధురమైన గొంతుతో పాటలు పాడటమే కాకుండా 85 చిత్రాలకు సంగీతం అందించిన ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్‌ చక్రి. ఉదయం 7 గంటల సమయంలో గుండెపోటుతో మృతి చెందారు. తెలుగు చిత్ర సీమలో తనదైన ముద్ర వేసిన చక్రి, బాచి చిత్రంతో తన కెరీర్‌ను మొదలు పెట్టారు. ఇటీవలే విడుదలైన ఎర్రబసు వరకు చక్రి అనేక హిట్‌ చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. సింహం సినిమాకు చక్రి నంది అవార్డు అందుకున్నాడు. సత్యం చిత్రంలో ఓ మగువా నీతో స్నేహం కోసం అనే పాటకు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు అందుకున్నారు. అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి చిత్రంలో అమ్మపై పాడిన నీవే నీవే పాటతో తల్లిపై ప్రేమను చాటాడు. మరోవైపు ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్‌ దిగ్భాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తెలంగాణ బిడ్డ మరణం తీరని లోటు అని.. చిన్న వయసులోనే చక్రి ఎన్నో విజయాలు సాధించారని కేసీఆర్‌ అన్నారు. చక్రి హఠాన్మరణంపై ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్‌, బాలకృష్ణ దిగ్భాంతి వ్యక్తంచేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన మృతిని నమ్మలేపోతున్నానని బాలకృష్ణ అన్నారు. చక్రి హఠాన్మరణం పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి రాజయ్య, ఎంపీ చిరంజీవి, టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, దర్శకుడు శంకర్‌, సంగీత దర్శకురాలు ఎం.ఎం. శ్రీలేఖ తదితరులు సంతాపం ప్రకటించి చక్రి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సంగీత దర్శకుడు చక్రి తుదిశ్వాస విడిచిన విషయం విదతమే. ఈ సందర్భంగా చక్రి భౌతికకాయాన్ని గాయకుడు వందేమాతరం శ్రీనివాస్‌ సందర్శించి నివాళులర్పించారు. వందేమాతరం మాట్లాడుతూ.. చక్రి మంచి స్నేహశీలి అని కొనియాడారు. మంచి ఆత్మీయ మిత్రుడుని కోల్పోయామని భోరుమన్నారు. చక్రి పేరు శ్వాశతంగా నిలిచిపోయేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి మృతి తెలుగు ప్రజల దురదృష్టమని తెలంగాణ టిడిపి నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. చక్రి భౌతికకాయానికి నివాళులు అర్పించిన అనంతరం ఆయన విూడియాతో మాట్లాడారు. చాలా మందిని చిత్ర సీమకు పరిచయం చేసిన వ్యక్తి చక్రి అని పేర్కొన్నారు. చక్రి పేరు విూద ఓ మ్యూజియాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.