ప్రమోషన్లలో రిజర్వేషన్లకు ఓకే: సుప్రీం

న్యూఢిల్లీ,జూన్‌5(జనం సాక్షి ): ఎస్‌సీ, ఎస్‌టీ ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్ల అమలుకు చట్ట ప్రకారం ముందుకెళ్లవచ్చని సుప్రీం కోర్టు మంగళవారం కేంద్రాన్ని అనుమతించింది. వివిధ హైకోర్టులు, 2015లో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన యథాతథ ఉత్తర్వుల కారణంగా మొత్తం ప్రమోషన్ల పక్రియనిలిచిపోయిందని కేంద్రం నివేదించడంతో జస్టిస్‌ ఆదర్శ్‌కుమార్‌ గోయల్‌, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌లతో కూడిన సుప్రీం బెంచ్‌ కేంద్ర ప్రభుత్వానికి ప్రమోషన్ల ప్రకియకు అనుమతిస్తూ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.ఎస్‌సీ, ఎస్‌టీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లపై ఢిల్లీ, బాంబే, పంజాబ్‌ అండ్‌ హర్యానా హైకోర్టులు వేర్వేరు తీర్పులు ఇచ్చాయని, వీటిపై సర్వోన్నత న్యాయస్థానం సైతం భిన్న ఉత్తర్వులు జారీ చేసిందని ప్రభుత్వం కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. ప్రమోషన్లలో కోటా విషయంలో పలు కేసులను కేంద్రం తరపున వాదనలు వినిపించిన అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ మణీందర్‌ సింగ్‌ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ అంశంలో ఎం నాగరాజ్‌ కేసు విషయంలో 2006లో సర్వోన్నత న్యాయస్ధానం ఇచ్చిన తీర్పును వర్తింపచేయవచ్చన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్‌సీ, ఎస్‌టీ ఉద్యోగుల ప్రమోషన్ల విషయంలో క్రీవిూలేయర్‌ వర్తింపచేయలేమని ఈ కేసులో కోర్టు స్పష్టం చేసిందన్నారు.