ప్రాంతీయ పార్టీలను దెబ్బతీసేందుకే..

‘జమిలి’ ఎత్తుగడ
– రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థను బలహీనపర్చేందుకు జీఎస్టీని వాడుకుంటున్నారు
– నరేంద్రమోడీలా గతంలో ఎవరూ కుట్ర రాజకీయాలు చేయలేదు
– ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు
అమరావతి, జులై6(జ‌నం సాక్షి ) : ప్రాంతీయ పార్టీలను దెబ్బతీసేందుకే జమిలి ఎన్నికల అంశాన్ని  ప్రధాని మోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్‌షాలు తెరపైకి తెస్తున్నారని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. అనేక ప్రాంతీయ పార్టీల నేతలు ఆయా ప్రాంతాలలో బలంగా ఉన్నారని, వారిని బలహీన పరిచేందుకే జమిలి ఎన్నికల ఎత్తుగడను భాజపా వేస్తోందన్నారు. ఏ జాతీయ పార్టీకూడా సొంతబలంతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుచేసే స్థితిలో లేదని జోస్యం చెప్పారు. ప్రాంతీయ పార్టీలు ఆయా రాష్ట్రాల్లో బలోపేతం కావడం రాజకీయంగా జాతీయ పార్టీలకు విఘాతంగా మారిందన్నారు. 15వ ఆర్థిక సంఘం మార్గదర్శకాలు రాష్ట్రాల ఆర్థిక స్వయం ప్రతిపత్తికి ప్రమాదకరంగా పరిణమించాయని తెలిపారు. భాజపా నేతలే ఈ మార్గదర్శకాలను 15వ ఆర్థిక సంఘానికి సూచించారన్నారు. జీఎస్టీని కూడా రాష్ట్రాలను బలహీన పరిచేందుకే వాడుకుంటున్నారని విమర్శించారు. రాష్టాల్రకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులను కాలరాయాలని చూస్తున్నారని వివరించారు. జీఎస్టీ, 15వ ఆర్థిక సంఘం, జమిలి ఎన్నికల వంటి ఆలోచనలన్నీ జాతీయ పార్టీల ఆధిపత్యం పెంచుకునేందుకే అని విమర్శించారు. రాజకీయంగా ప్రాంతీయ పార్టీలను దెబ్బకొట్టడం, ఆర్థికంగా రాష్ట్రాలను బలహీనపరచడమే అజెండాగా కేంద్రంలోని భాజపా నేతలు పెత్తందారీ పోకడల్లో వ్యవహరిస్తున్నారని యనమల అన్నారు. తమిళనాడులో అన్నాడీఎంకే, పశ్చిమ్‌బంగలోని మమతా బెనర్జీ, దిల్లీలో కేజీవ్రాల్‌, బిహార్‌లో నితీశ్‌కుమర్‌, లాలూ, ప్రస్తుతం ఆంధప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ పట్ల ఆ పార్టీ ఏవిధంగా వ్యవహరిస్తోందో దేశ ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు. నరేంద్రమోదీ తరహాలో గతంలో ఎవరూ ఇలా రాజకీయ కుట్రలు చేయలేదన్నారు. మోదీ, షా ద్వయం పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు.