ప్రాంతీయ పార్టీ అయిన జేడీఎస్‌కు తామంతా ఉండగా ఉంటాం :మమతా బెనర్జీ

బెంగళూరు: దేశ రాజకీయాల్లో సరికొత్త ఫ్రంట్ పురుడు పోసుకుంటోందా? బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ఏకతాటిపైకి రానున్నాయా? 2019 లోక్‌సభ ఎన్నికల నాటికి ప్రాంతీయ పార్టీలు ఫ్రంట్ దిశగా అడుగులేస్తున్నాయా? తాజా పరిణామాలను గమనిస్తే ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానమొస్తుంది. బీజేపీకి కర్ణాటకలో అధికారాన్ని అందని ద్రాక్షగా చేసిన జేడీఎస్.. ప్రాంతీయ పార్టీల ఏకతా రాగానికి కారణమైంది. కుమారస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రాంతీయ పార్టీల బలాన్ని నిరూపించుకునేందుకు వేదిక కాబోతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఈ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. కుమారస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు బెంగళూరు వెళ్లిన ఆయన.. అక్కడకు వచ్చిన మమతా బెనర్జీ, మాయావతితో వేర్వేరుగా చర్చలు జరిపారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని వివరించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ… ప్రాంతీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. మమతా బెనర్జీ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాలు బలంగా ఉంటేనే దేశం బలంగా ఉంటుందని ఆమె చెప్పారు. దేశ భవిష్యత్ కోసం మేమంతా ఏం చేయాలన్నా ధైర్యంగా చేస్తామని మమత వ్యాఖ్యానించారు. దేశాభివృద్ధి కోసం అంతా కలిసి పనిచేస్తామని మమతాబెనర్జీ స్పష్టం చేశారు. మాయావతి కూడా ఫ్రంట్ ఏర్పాటుకు సంబంధించి సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. టీడీపీ, బీఎస్పీ, తృణముల్ కాంగ్రెస్ పార్టీలు బీజేపీపై తిరుగుబాటును ప్రకటించాయి. కుమారస్వామి ప్రమాణస్వీకార వేదికపై మరికొన్ని ప్రాంతీయ పార్టీలు జత కట్టే అవకాశం లేకపోలేదు. మొత్తం మీద అందరూ ఊహించినట్లుగానే ప్రాంతీయ పార్టీల ఐక్యతను నిరూపించుకునేందుకు ఇదో చక్కని అవకాశంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.