ప్రాక్టీస్‌ మ్యాచ్‌లతో ఫామ్‌లోకి ఇంగ్లీష్‌ క్రికెటర్లు

నాలుగు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌ కోసం భారత గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లీష్‌ క్రికెటర్లు ప్రాక్టీస్‌ మ్యాచ్‌లలో నిమగ్నమైవున్నారు. వివిధ జట్లతో జరుగుతున్న ఆ వార్మప్‌ మ్యాచ్‌లలో టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్లు ఒక్కొక్కరిగా ఫామ్‌లోని వస్తున్నారు. భారత్‌లోని వాతావరణ పరిస్థితులకు చక్కగా అలవాటు పడుతూ ఇక్కడి క్లిష్ట పరిస్థితులను అర్థం చేసకుంటూ క్రీజ్‌లో బ్యాట్‌తో రాణిస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల ఉద్వాసనకు గురై తిరిగి జట్టులో స్థానం దక్కించుకున్న డాషింగ్‌ బ్యాట్స్‌మెన్‌ కెవిన్‌ పీటర్సన్‌ హర్యానా జట్టుతో జరుగుతున్న ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ద్వారా మంచి ఫామ్‌లోకి వచ్చాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 81 బంతుల్లో సెంచరీ సాధించాడు. అలాగే, ఓపెనర్‌, కెప్టెన్‌ అలిస్టర్‌ కుక్‌ కూడా 97 పరుగులు సాధించి తృటిలో సెంచరీ మిస్‌ అయ్యాడు. దీంతో ఇంగ్లండ్‌ ఎలెవన్‌ జట్టు మాడు వికెట్ల నష్టానికి 408 పరుగుల భారీ స్కోరు సాధించింది. అలాగే ఇంగ్లండ్‌ జట్టులో ఓపెనర్‌ స్థానం కోసం ఎదురుచూస్తున్న కాంప్టన్‌ 74 పరుగులు సాధించి ఆకట్టుకున్నాడు. భారత్‌తో తొలి టెస్ట్‌ మ్యాచ్‌ ఆరంభానికి ముందే ప్రధాన ఆటగాళ్లు ఫామ్‌లోకి వస్తుండటంతో ఈ సిరీస్‌ పోటాపోటీగా సాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.