ప్రియాంక రాకతో బిజెపిలో వణుకు: జంగా

జనగామ,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి): ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన ప్రియాంకా గాంధీ రాకతో అధికార బిజెపికి వణుకు పుట్టిందని జనగామ డిసిసి అధ్యక్షుడిగా నియమితులైన జంగా రాఘవరెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ కేంద్రంలో అధికారంలోకి రావడం ఖాయమన్నారు. డిసిసి అధ్యక్షుడిగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. రాహుల్‌ సోదరి ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన సందర్భంగా బిజెపి నేతలు స్థాయి మరచి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తీసుకున్న నిర్ణయంతో వణుకు పుడుతోందని అన్నారు. ఇద్దరూ కలసి బీజేపీని తుడిచిపెట్టడం ఖాయమని పేర్కొన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబి స్తోందనీ… వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు ఈ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. రాహుల్‌ గాంధీ గొప్ప నాయకత్వ లక్షణాలున్న నేత అన్నారు. రాఫెల్‌పై సమాధానం చెప్పలేక ప్రధాని మోడీ అనవసర విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.రాహుల్‌ గాంధీ అందరితో చర్చిస్తూ పూర్తి ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. ప్రియాంక భర్త రాబర్ట్‌ వాద్రాపై ఈడీ కేసు నమోదు చేయడం కేవలం కేందప్రభుత్వం రాజకీయ కక్షసాధింపులో భాగమేనన్నారు. ప్రజాస్వామ్యం లో ఇలాంటివి చోటుచేసుకోవడం మంచిది కాదని హితవు పలికారు. కేసులతో బెదిరింపు రాజకీయాలు చేయలేదరని అన్నారు.