ప్రేమలో విఫలమై.. 

భారత సైన్యం చేతిలో బలవ్వాలని వచ్చాడు!
– అదుపులోకి తీసుకున్న పోలీసులకు అప్పగించిన బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది
జమ్మూకాశ్మీర్‌, మే31(జ‌నం సాక్షి) : ప్రేమలో విఫలమైన ఓ పాకిస్థానీ యువకుడు భారత సైన్యం చేతిలో చనిపోవడం కోసం బోర్డర్‌ దాటొచ్చాడు. అతణ్ని అదుపులోకి తీసుకున్న బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. పాకిస్థాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్స్‌లోని జల్లోక్‌ అనే గ్రామానికి చెందిన మహ్మద్‌ అసిఫ్‌ (32) తన వదిన వాళ్ల చెల్లెల్ని ప్రేమించాడు. ఆ అమ్మాయి కూడా అసిఫ్‌ను ఇష్టపడింది. అతడి కుటుంబానికి పాతిక ఎకరాల పొలం ఉంది, చదువుకున్నాడు. కానీ అతడితో పెళ్లికి అమ్మాయి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. ఆ అమ్మాయికి వేరే వ్యక్తితో బలవంతంగా పెళ్లి జరిపించారు. కొంత కాలం తర్వాత ఆమె భర్త నుంచి విడాకులు తీసుకుంది. ఈసారి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి అబ్బాయి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. ఎంత బతిమాలినా ప్రయోజనం లేకపోవడంతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. పవిత్ర రంజాన్‌ మాసంలో బలవన్మరణానికి పాల్పడం పాపమని భావించి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. కానీ ఎలాగైనా చనిపోవాలనుకున్నాడు. బోర్డర్‌ దాటితే భారత సైనికులు కాల్చి చంపుతారని అనుకున్నాడు. అనకున్నదే తడవుగా.. సరిహద్దు దాటొచ్చాడు. మబోక్‌ బోర్డర్‌ పోస్ట్‌ దగ్గర అతణ్ని పట్టుకున్న బీఎస్‌ఎఫ్‌ జవాన్లకు తన గోడు చెప్పుకొని వాపోయాడు.
అసిఫ్‌ చెప్పింది విన్న పోలీసులు.. అక్రమంగా సరిహద్దు దాటి వచ్చిన అతణ్ని మమడాట్‌ పోలీసులకు అప్పగించారు. ఇండియన్‌ పాస్‌పోర్ట్‌ యాక్ట్‌, ఫారెనర్స్‌ యాక్ట్‌ కింద పోలీసులు కేసు బుక్‌ చేశారు.
————————————-