” ప్రైవేటు కళాశాలలకు కొమ్ముగాస్తున్న తెరాస ప్రభుత్వాన్ని రాష్ట్రం నుండి తరిమికొట్టాలి – ఏబివిపి”

శేరిలింగంప‌ల్లి, ఆగస్టు 23( జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన మరుక్షణంలో రాష్ట్రంలో ప్రైవేట్ విద్యా వ్యవస్థకు స్వస్తి పలుకుతామని, కార్పొరేట్ కళాశాలల వ్యవస్థను నిర్మూలిస్తామని గొప్పలు చెప్పిన తెరాస ప్రభుత్వం చివరకు వారితోనే అంటకాగడం సిగ్గుచేటని, ఇలాంటి దళారీ ప్రభుత్వాన్ని రాష్ట్రం పొలిమేరలనుండి తరిమి కొట్టాల్సిన అవసరం ఉందని అఖిలభారత విద్యార్థి పరిషత్ శేరిలింగంపల్లి విభాగం స్పష్టం చేసింది. ఈమేరకు కార్పొరేట్ కళాశాలలను మూసివేళం డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్త బందుకు పిలుపునిచ్చిన నేపథ్యంలో మంగళవారం శేరిలింగంపల్లి చందానగర్ లో నిర్వహించిన కళాశాలల బంద్ కార్యక్రమం విజయవంతం అయింది. ఈసందర్భంగా ఏబివిపి నాయకులు మాట్లాడుతూ తెలంగాణ సెంటిమెంటుతో గద్దెనెక్కిన గులాబీ నాయకులు తదనంతరం పూర్తిగా తెలంగాణ విధ్వంసానికి పాల్పడుతున్నారని, రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని వంచన చేస్తున్నారని వారు దుయ్యబట్టారు. తెలంగాణ నిరుపేద విద్యార్థులకు నాయనమైన విద్యను అందిస్తామని గొప్పలు చెప్పుకున్న గులాబీ పాలకులు విద్యను పూర్తిగా వ్యాపారంగా చేయడం వారి దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. వెంటనే వారి ఆలోచనలు మానుకొని పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న శ్రీ చైతన్య, నారాయణ విషవృక్షాలను బుధ ముట్టించాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన మెమొరాండమును వారు మీడియాకు అందజేశారు. ఇందులో ప్రధానంగా రాష్ట్రంలో కార్పొరేటు విద్యావ్యవస్థ నశించాలని, ఒకే పేరుతో వందల బ్రాంచీలను సృష్టిస్తున్న నారాయణ, శ్రీచైతన్య యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలోని ప్రభుత్వ కళాశాలల్లో మౌలిక వసతులను పెంచి విద్యా ప్రమాణాలను మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా సమాంతర విద్యా వ్యవస్థను కొనసాగిస్తున్న నారాయణ శ్రీ చైతన్య కళాశాలల గుర్తింపు రద్దు చేయాలని, వారి హాస్టల్ లో నిర్వహణను నిర్మూలించాలని ఏబివిపి స్పష్టం చేసింది. ఇంటర్ విద్యలో కార్పొరేట్ ఆగడాలు, విద్యార్థుల ఆత్మహత్యలను మానవ హక్కుల సంఘం సుమోటోగా స్వీకరించి సెట్టింగ్ జడ్జిలచే విచారణజరిపించి ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మస్తాన్, పవన్, శివ, వంశీ తదితరులు పాల్గొన్నారు.