ప్రైవేటు పోటీని నిలువరిస్తాం
– ధీటుగా సర్కారు బడులను మలుస్తాం
– మంత్రి కడియం శ్రీహరి
వరంగల్,మే5(జనంసాక్షి): వచ్చే రెండు సంవత్సరాల్లో ప్రైవేటు స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామని తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి వరంగల్‌లో అన్నారు. ఇంగ్లీష్ విూడియంతో కెజి టూ పిజి ఉచిత విద్యను అమలు చేస్తామన్నారు. ప్రజలందరూ భాగస్వాములైతే విద్యావ్యవస్థ పటిష్ఠం అవుతుందని పేర్కొన్నారు. హన్మకొండలో వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామ విద్యాభివృద్ధి కమిటీల జిల్లా సదస్సు జరిగింది. ఈ సదస్సులో కడియం శ్రీహరితో పాటు విద్యావేత్త చుక్కా రామయ్య పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… బడుగు బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్య అందించడమే తెరాస ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. దేశంలోనే తొలిసారిగా ఈ విద్యా సంవత్సరం నుంచి 250 గురుకులాలను ప్రవేశపెట్టబోతున్నట్లు చెప్పారు. గ్రామస్థాయి నుంచి ప్రజలందరూ సంఘటితమై ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణలో దశలవారీగా మండలానికో గురుకులాన్ని ఏర్పాటుచేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కేజీ నుంచి పీజీ విద్యావిధానంలో భాగంగా వీటిని విస్తరిస్తామని, దేశానికి మార్గదర్శకంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. తెలంగాణలో కొత్తగా స్థాపించనున్న 180 దళిత, గిరిజన గురుకులాల విధివిధానాలపై సిఎం కేసీఆర్ ఇప్పటికే సవిూక్ష నిర్వహించారని అన్నారు.తెలంగాణలోని గురుకులాలు అద్భుతంగా నడుస్తున్నాయని, మరిందరు విద్యార్థులకు ఈ సౌకర్యం కల్పించేందుకు దళిత, గిరిజన, మైనారిటీల కోసం 250 కొత్త గురుకులాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. గురుకుల విద్యతో భవిష్యత్తులో మెరికల్లాంటి విద్యార్థులు తయారై, దేశానికే ఆదర్శంగా నిలుస్తారని ఆకాంక్షించారు. గురుకులాల ఏర్పాటుకు వెచ్చించే ప్రతీ పైసా సమాజానికి, రాష్టాభ్రివృద్ధికి ఉపయోగపడుతుందని తెలిపారు. తెలంగాణలో దళిత, గిరిజన విద్యార్థులకు 150 గురుకుల కళాశాలలు, 30 డిగ్రీ కళాశాలలు ఏర్పాటవుతాయన్నారు. ఒక్క గురుకులం కూడా లేని శాసనసభ నియోజకవర్గాల్లో వీటిని నెలకొల్పుతారు. ఎస్సీ రిజర్వ్‌డ్ శాసనసభ నియోజకవర్గాల్లో రెండు లేదా మూడు గురుకులాలుండాలని సిఎం సూచించారని అన్నారు.
ప్రవేశాలకు మహబూబ్‌నగర్, వరంగల్, నల్గొండ, ఆదిలాబాద్ వంటి జిల్లాల్లో భారీగా విద్యార్థులనుంచి డిమాండ్ ఉన్నందున కొత్త గురుకులాల ఏర్పాటులో ప్రాధాన్యమివ్వాలని కూడా సూచించినట్లు మంత్రి తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో ఇప్పటికే గురుకులాలుంటే వాటికి సవిూప మండలాల్లో కొత్తవాటి ఏర్పాటుకు ప్రాధాన్యమిస్తారు. డిగ్రీ కళాశాలలన్నీ పట్టణ ప్రాంతాల్లో ఉంటాయి. ప్రతీ మూడు నియోజకవర్గాలకు కేంద్రంగా ఒక్కో డిగ్రీ కళాశాల ఉంటుంది. విశ్వవిద్యాలయాలకు సవిూప ప్రాంతాన్ని ఎంపిక చేస్తారు. వందేమాతరం ఫౌండేషన్ కృషిని మంత్రి కడియం అభినందించారు. ఇది వరంగల్ జిల్లాకు గర్వ
కారణమన్నారు. ప్రభుత్వ పాఠశాలలు సమగ్ర వికాసం చెందాలంటే సమాజం పూర్తి భాగస్వామ్యాన్ని స్వీకరించి ప్రత్యక్ష పాత్ర వహించేలా ముందుకు రావాలని భావించి తొర్రూరులోని వందేమాతరం ఫౌండేషన్… గత ఏడాది బడిని బతికించుకుందామా… అని లక్ష కరపత్రాలను ముద్రించి వంద గ్రామాలలో ఇంటింటికి పంచింది. దీంతో ప్రజల్లో చర్చమొదలైంది. గ్రామంలో వెలుగులు నింపాల్సిన బడులు వెలవెలపోడానికి వీల్లేదని కొన్నిచోట్ల చైతన్యం వచ్చింది. విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ చుక్కా రామయ్య మార్గదర్శకంలో ‘బడి మనదే… బాధ్యత మనదే’; ‘ఉద్యమంగా కదులుదాం ఊరి బడిని కాపాడుకుందాం’ అనే నినాదం గ్రామ విద్యాభివృద్ధి కమిటీల ఏర్పాటుకు నాందీవాచకమైంది. బడి సంరక్షణ, బాధ్యతను తీసుకుంటామని… అది పెత్తనం చేయడానికి కాదని.. పనిచేస్తున్న ఉపాధ్యాయులకు భరోసాగా ఉండటానికేనని కొందరు ముందుకొచ్చారు. జిల్లాలోని తొర్రూరు, నెల్లికుదురు, నెక్కొండ, సంగెం, పర్వతగిరి, వర్ధన్నపేట, జఫర్‌గఢ్, స్టేషన్ ఘన్‌పూర్, రఘునాధపల్లి, పాలకుర్తి, జనగామ, నర్సింహులపేట మండలాలకు చెందిన 62 గ్రామాలు ఈ మహా యజ్ఞంలో ముందుకు కదిలాయి. వీటి పరిధిలోని 125 పాఠశాలల సమగ్ర వికాసాన్ని వందేమాతరం ఫౌండేషన్ రాష్ట్ర ప్రభుత్వ విద్యాప్రణాళికను అనుసరించి కార్యక్రమాల రూపకల్పన చేసింది. ఈ 62 గ్రామాలలో కలెక్టర్ కరుణ చొరవ చూపి ఇంగ్లీష్ విూడియం ప్రారంభించడానికి ఉత్తర్వులు జారీచేశారు. దీనికి అవసరమైన మౌలిక వసతుల కల్పన, విద్యా ప్రమాణాల పెంపు కోసం ఒకటి నుంచి పదో తరగతి వరకు తరగతికి ఐదుగురు చొప్పున గ్రామస్థులు దత్తత తీసుకున్నారు. ఫౌండేషన్ చేస్తున్న కృషిని విద్యావేత్త చుక్కారామయ్య,కలెక్టర్ వాకాటి కరుణలు కూడా అభినందించారు.