ప్లాస్టిక్‌ వ్యర్థాల నుంచి గోదావరిని కాపాడాలి

రాజమహేంద్రవరం,జూలై5(జ‌నం సాక్షి): స్వచ్ఛ గోదావరి చొరవతో స్వచ్ఛభారత్‌ పక్షోత్సవాల్లో ఓఎన్‌జిసి కార్యకలాపాలు సాగిస్తున్న ప్రాంతాల్లో తాగునీరు, నీటిపారుదల కాలువలను పరిశుభ్రం చేయించనున్నట్లు ఒఎన్‌జిసి రాజమండ్రి అసెట్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, అసెట్‌ మేనేజర్‌ డిఎంఆర్‌ శేఖర్‌ తెలిపారు. ప్లాస్టిక్‌ వాడకాన్ని నిషేధించాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని నగర కమిషనర్‌ సుమిత్‌కుమార్‌ గాంధీ పిలుపు మేరకు ఆయన ముందుకు వచ్చారు. స్వచ్ఛభారత్‌ పక్షోత్సవాల్లో భాగంగా ఒఎన్‌జిసి, రాజమహేంద్రవరం మున్సిపల్‌ కార్పొరేషన్‌ సంయుక్తంగా ప్లాస్టిక్‌ ఫ్రీ గోదావరి కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ప్రతిఒక్కరినీ కమిషనర్‌ సుమిత్‌కుమార్‌ సన్మానించారు. నగరంలో ప్రతిరోజూ 25-30 టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు వస్తున్నాయని, పౌర అధికారులు, నగర ప్రజలకు ఇది పెద్ద సవాలుగా మారుతోందని తెలిపారు. జనపనార సంచులు, వస్త్ర సంచుల ఉపయోగించడం ద్వారా దీన్ని నివారించవచ్చునన్నారు.ఈ ఏడాది చివరినాటి కల్లా సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ నియంత్రిస్తామని తెలిపారు. ప్లాస్టిక్‌ కాలుష్య నివారణ పట్ల ప్రతి పౌరుడు బాధ్యత వహించాలని, జీవనది అయిన గోదావరిని ప్లాస్టిక్‌ నుంచి కాపాడుకోవాలని కోరారు.