ఫిక్కి-ఐఫా గ్లోబల్ బిజినెస్ ఫోరం సమావేశానికి కేటీఆర్ ఆహ్వానం
హైదరాబాద్,జూన్ 16(జనంసాక్షి):స్పెయిన్‌లో ఈనెల 24న జరగనున్న ఫిక్కి-ఐఫా గ్లోబల్ బిజినెస్ ఫోరమ్ సమావేశానికి విచ్చేయాల్సిందిగా తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ను ఫిక్కి నిర్వాహక బృందం కోరింది. ఈ సమావేశంలో సినర్జీస్ ఇన్ ఐటీ, స్మార్ట్ సిటీ, టూరిజం ప్రమోషన్ అనే అంశంపై ప్రసంగించాల్సి ఉంటుంది. ఏటా జరిగే ఐఫా సినిమా అవార్డు ప్రధాన కార్యక్రమం ప్రపంచంలోని వివిధ నగరాల్లో జరుగుతుంది. స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో జరగనున్న ఈ కార్యక్రమంలో బిజినెస్ ఫోరమ్ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి ఐటీ, ఎలక్ట్రానిక్స్, సినిమా, విూడియా, ఎంటర్‌టైన్‌మెంట్, రెనెవబుల్ ఎనర్జీ, పురపాలన, రహదారుల అభివృద్ధి వంటి రంగాల్లో పలు సెషన్లుగా చర్చలు నిర్వహించనున్నారు.అదే విధంగా జాతీయ కార్యవర్గం సమావేశంలో పాల్గొనాలని ఐటీ, మున్సిపల్, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ను ఫిక్కి కోరింది. ఫిక్కి ఛైర్మన్‌గా ఎన్నికైన హర్షవర్థన్ నియోటియా అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది.వచ్చే నెల 4న హైదరాబాద్‌లో జరిగే ఈ సమావేశానికి దేశంలోని ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, నిపుణుల వస్తారని ఈ సందర్భంగా తెలంగాణలోని వ్యాపార అవకాశాలపై ప్రసంగించాలని తెలంగాణ ఫిక్కి ఛైర్ పర్సన్ సంగీతా రెడ్డి మంత్రికి ప్రత్యేక ఆహ్వానం పంపించారు. ఈ సందర్భంగా ఫిక్కి పంపిన రెండు ఆహ్వానాలపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.