ఫీజులకు ప్రమాణాలే ప్రామాణికం
రూ.31 వేల వరకే రీయింబర్స్‌మెంట్
మంత్రి వర్గ ఉప సంఘం కీలక నిర్ణయాలు
హైదరాబాద్, ఆగస్టు 6 (జనంసాక్షి): ఇంజనీరింగ్ కాలేజీల ఫీజులకు సంబంధించి మంత్రివర్గ ఉప సంఘం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఫీజు రీయంబర్స్‌మెంట్, ఏకీకృత ఫీజుల విధానంపై చర్చించేందుకు సచివాలయంలో సోమవారం ఉప సంఘం సమావేశమైంది. సమావేశం అనంతరం సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి పితాని సత్యనారాయణ వివరాలను విలేఖరులకు తెలిపారు. ఫీజుల విషయంలో ప్రైవేటు కాలేజిల ఒత్తిడికి ఎట్టిపరిస్థితుల్లోనూ తలొగ్గకూడదని మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించిందని మంత్రి చెప్పారు. జులుం చలాయించే ప్రైవేటు కాలేజీల యాజమాన్యాల పట్ల కఠినంగా వ్యవహించాలని కూడా నిర్ణయించారు. ప్రభుత్వపరంగా ఇంజనీరింగ్ కాలేజీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. జిల్లాకు రెండు చొప్పున తొలివిడుతలో 50 కాలేజీలను ఏర్పాటు చేయాలని మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించింది. కొన్ని పాలిటెక్నిక్ కాలేజీలను ఇంజనీరింగ్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేయాలని కూడా నిర్ణయించారు. కాలేజీలలో నాణ్యత ప్రమాణాలు పెంచేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. కాలేజీలలో నాణ్యత ప్రమాణాలు, మౌలిక వసతుల పరిశీలనకు 6 నెలలకు ఒకసారి తనిఖీలు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. వీటి పరిశీలను మూడు జేఎన్‌టీయూసీల పరిధిలో ప్రత్యేకంగా మూడు టాక్స్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ బృందాలు కాలేజీలను తనిఖీ చేసి నివేదిక సమర్పించిన తర్వాతే ఫీజులను ఖరారు చేయాలని కమిటీ నిర్ణయించింది. రీయంబర్స్‌మెంట్ పొందేందుకు కూడా నిబ్బందనలను మార్పు చేయాలని కమిటీ నిర్ణయించిందన్నారు. ప్రతి ఏడాది 50 శాతం సబ్జెక్ట్‌లలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకే మరుసట ఏడాది ఫీజు రీయంబర్స్‌మెంట్ వర్తింప చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలలో సీట్లను పెంచాలని కూడా క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. కాలేజీలలో కన్వినర్, మేనేజ్‌మెంట్ కోట ద్వారా సీట్ల భర్తీ పారదర్శకంగా ఉండేందుకు ఆన్‌లైన్ ద్వారానే అడిమిషన్లు జరపాలని నిర్ణయించింది. రూ. 31 వేల ఫీజు వరకు మాత్రమే ప్రభుత్వం భరించాలని అది దాటితే బ్యాంకుల ద్వారా విద్యార్థులకు వడ్డీ లేని రుణ సౌకర్యం కల్పించాలని సూచించింది. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కేంద్రం నుంచి వచ్చే నిధుల ద్వారా రీయంబర్స్‌మెంట్‌ను వర్తింప చేయాలని నిర్ణయించినట్లు మంత్రి పితాని సత్యనారాయణ తెలిపారు. కాలేజీల నాణ్యత ప్రమాణాల మేరకు ఏకీకృత ఫీజులను చెల్లించాలని నిర్ణయించినట్టు ఆయన చెప్పారు. ఫీజుల నియంత్రరణ మండలి పని తీరు సరిగా లేదని అన్నారు. దీనిని బలోపేతం చేసేందుకు సుప్రీం కోర్టు నిబ్బందనల నేపథ్యంలో కొత్త చట్టాన్ని రూపొందిస్తామని చెప్పారు. కొత్త ఫీజుల నిర్ణయానికి మండలి కొంత సమయం కోరిందని చెప్పారు. ఇంజనీరింగ్ కాలేజీలలో ప్రవేశానికి నిర్వహించే కౌన్సెలింగ్‌ను జాప్యం చేయబోమని మంత్రి చెప్పారు. ఈ నెల 8వ తేదీన మరోసారి క్యాబినెట్ సబ్ కమిటీ భేటి అవుతోందని ఈ సమావేశంలో కౌన్సెలింగ్ తేదీలను ప్రకటిస్తామని మంత్రి చెప్పారు. అందు వల్ల కౌన్సెలింగ్‌పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో మంత్రులు ఆనం రాంనారాయణరెడ్డి, డిఎల్ రవీంద్రారెడ్డి, అహ్ముదుల్లా, సారయ్య తదితర సభ్యులు పాల్గొన్నారు.