ఫీజు రీయింజర్స్‌మెంట్ అధ్యయనానికి నిపుణుల కమిటీ
హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్ వ్యవహరంపై అధ్యయనానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి నిపుణుల కమిటి నియమించారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ జయప్రకాశ్ నేతృత్వంలో 9మంది సభ్యులతో ఈ కమిటీని నియమిస్తూ ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఫీజులపై రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టివేస్తూ ఏకీకృత ఫీజు విధానంపై సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసినందున ప్రస్తుత పరిస్థితిపై అధ్యయనం చేసేందుకు ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఫీజుల నిర్దారణలో మరింత స్పష్టతపై కమిటీ అధ్యయనం చేస్తుంది. రీక్వావ్ చైర్మన్ కె.సి రెడ్డిని కమిటీలో ప్రత్యేక ఆహ్వానితునిగా చేర్చారు. సాంఘీక సంక్షేమ శాఖ సభ్య కార్యదర్శి రేమండ్ పీటర్ సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు. ఉన్నత, సాంకేతిక విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి గోపాల్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సాంబశివరావు, మాజీ వైస్ ఛాన్స్‌లర్ వి. రామకిష్టయ్య, హైదరాబాద్ ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ ఉదయ్, కాకినాడ జేఎన్‌టీయూ వీసీ ప్రొఫెసర్ తులసీరామదాస్ కమిటీలో సభ్యులుగా ఉంటారు. వీలైనంత త్వరగా కమిటీ నివేదికను మంత్రి వర్గ ఉపసంఘానికి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.