‘ఫీ’ జులుంపై కదం తొక్కిన తల్లిదండ్రులు
– మహా ధర్నా విజయవంతం
హైదరాబాద్,జూన్ 11(జనంసాక్షి): ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు మరోమారు రోడ్డెక్కారు. శనివారం ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా నిర్వహించారు. పలు ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీల నాయకులు మహాధర్నాలో పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ఫీజుల పేరుతో సాగుతున్న అక్రమ వ్యాపారాన్ని నియంత్రించాలంటూ… ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఫీజుల నియంత్రణ ఐకాసగా ఏర్పడిన పలు సంఘాల ప్రతినిధులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. వెంటనే ఫీజుల నియంత్రణకు సమగ్ర చట్టం తెచ్చి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విద్యా సంవత్సరంలో పెంచిన స్కూల్ ఫీజులు తగ్గించాలని డిమాండు చేస్తూ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రుల సంఘం ఆధ్వర్యంలో వేలాదిమంది ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా చేశారు. నగరంలోని పలు కార్పొరేట్ పాఠశాలలు, ఇంటర్నేషనల్ పాఠశాలల్లో అనూహ్యంగా ఫీజులు పెంచటాన్ని నిరసిస్తూ పిల్లల తల్లిదండ్రులు ఆందోళన బాట పట్టారు. పెంచిన ఫీజులు తగ్గించేవరకూ తాము పోరాడుతామని విద్యార్థుల తల్లిదండ్రుల సంఘం సభ్యులు చెప్పారు. ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల పెంపుపై విద్యార్థుల తల్లిదండ్రులు రోడ్లపైకి వచ్చినా ప్రభుత్వం కళ్లు తెరవడంలేదని చుక్కా రామయ్య మండిపడ్డారు. విద్యార్థుల తల్లిదండ్రులవి గొంతెమ్మ కోర్కెలు కావని ఆయన అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం న్యాయం చేస్తుందన్న నమ్మకం తనకు లేదని చెప్పారు. ప్రైవేటు ఇన్‌స్టిట్యూషన్లన్నీ మంత్రుల చేతుల్లోనే ఉన్నాయని అలాంటివాళ్లు ఉన్నంతకాలం విద్యా వ్యవస్థలో మార్పురాదని చుక్కా రామయ్య స్పష్టం చేశారు.
ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల దోపిడీపై పిడికిలి బిగింపు
మహాధర్నాలో నేతల సంఘీభావం
హైదరాబాద్ నాలెడ్జి హబ్ కాదని, దోపిడీకి అడ్డాగా మారిందని ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య అన్నారు. విద్యా వ్యాపారం ప్రజాస్వామ్యానికి దెబ్బ అని ఆయన పేర్కొన్నారు. ప్రైవేటు పాఠశాలల ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా శనివారం ఇందిరాపార్క్ వద్ద భారీ ధర్నా జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యావేత్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చుక్కా రామయ్య మాట్లాడుతూ… తల్లిదండ్రులను కస్టమర్లుగా చూస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. పిల్లల ఫీజులను పెట్టుబడిగా పెట్టి మంత్రుల పదవులను కొంటున్నారని వ్యాఖ్యానించారు. మధ్య తరగతి ప్రజలను రోడ్డెక్కించిన ఘటన ఈ ప్రభుత్వాలదేనని మండిపడ్డారు. విప్లవం ఎంతో దూరంలో లేదన్నారు. స్కూల్ మేనేజ్‌మెంట్లు దిగిరావాలని, స్కూల్ కమిటీలో తల్లిదండ్రులకు చోటు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల పెంపుపై విద్యార్థుల తల్లిదండ్రులు రోడ్లపైకి వచ్చినా ప్రభుత్వం కళ్లు తెరవడంలేదని చుక్కా రామయ్య మండిపడ్డారు. విద్యార్థుల తల్లిదండ్రులవి గొంతెమ్మ కోర్కెలు కావని ఆయన అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం న్యాయం చేస్తుందన్న నమ్మకం తనకు లేదని చెప్పారు. ప్రైవేటు ఇన్‌స్టిట్యూషన్లన్నీ మంత్రుల చేతుల్లోనే ఉన్నాయని అలాంటివాళ్లు ఉన్నంతకాలం విద్యా వ్యవస్థలో మార్పురాదని చుక్కా రామయ్య స్పష్టం చేశారు. ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాల ఆగడాలకు అడ్డుఅదుపు లేకుండా పోతోందని ఆందోళనలో పాల్గొన్న బిసి నేత కీష్ణయ్య, టిడిపి నేత రమణ తదితరులు ఆందోలన వ్యక్తం చేశారు. పిల్లల భవిష్యత్ విూద కోటి ఆశలు పెట్టుకుంటున్న పేరెంట్స్ వీక్‌నెస్‌ను క్యాష్ చేసుకుంటూ బహిరంగ వ్యాపారం చేస్తున్నాయిని, అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులకు నరకం చూపిస్తున్నాయని మండిపడ్డారు. విద్యను బిజినెస్‌గా మార్చుకుంటున్న ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాలపై పేరెంట్స్ అసోసియేషన్ పోరాటానికి తమ మద్దతు ఉంటుందన్నారు. ఈ విషయంలో కెసిఆర్ కళ్లు తెరవాలన్నారు. విూ పిల్లల ఫ్యూచర్ బాగుండాలంటే మా స్కూల్‌లో చేర్చండి ఫీజు గురించి ఆలోచించకుండా ఉజ్వల భవిష్యత్‌ను విూ బిడ్దలకు బహుమతిగా ఇవ్వండి అంటూ ప్రతీ ఏడూ ఊదరగొట్టేస్తూ పేరెంట్స్‌ను అట్రాక్ట్ చేస్తూ ఊబిలోకి దింపేస్తున్నాయి. మిడిల్ క్లాస్ పేరెంట్స్ ముక్కుపిండి మరీ తమ ఖజానా నింపుకుంటున్నాయి. ఎల్‌కేజీ, యూకేజీ చదువులకే స్కూల్ ఫీజు , అడ్మిషన్ ఫీజు, ట్యూషన్ ఫీజు అంటూ నిలువు దోపిడీ చేస్తున్నాయి. అంతటితో ఆగుతున్నాయా అంటే అదీ లేదు. చిన్నారులను బడిలో చేర్చాక స్కూల్ యాజమాన్యాలు నోట్ బుక్స్, టెక్స్‌బుక్స్ అంటూ స్కూల్‌లోనే పక్కా బిజినెస్ చేస్తున్నాయి. ఈ దోపిడీ కనిపించడం లేదా అని అన్నారు. పిల్లలకు టెన్త్ క్లాస్ ముగిసే సమయానికి తల్లిదండ్రులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఫీజు వసూలు చేయడంలో ఒక్కో స్కూల్‌ది ఒక్కో స్టైల్. స్కూల్‌ను బట్టి రేట్లు మారుతూ ఉంటాయి. గల్లీ కన్పించే స్కూల్‌వైతే ఓ రకం ఫీజు, కార్పొరేట్ స్కూల్‌లలో అయితే మరోరకం ఫీజు, ఇక టెక్నో, కాన్సెప్ట్, ఇంటర్నేషనల్ స్కూల్‌లకైతే స్కూల్‌నేమ్‌కు ముందో వెనుకో ఓ తోక తగిలించి ఫీజులను రెట్టింపు చేస్తున్నాయి. కేవలం తల్లిదండ్రుల బలహీనతను అడ్డంపెట్టుకునే కోట్లు దండుకుంటున్నాయి. ఈ అన్యాయాన్ని ప్రశ్నించేవారే లేకపోవడంతో ఇష్టానుసారం ఫీజులు పెంచి తల్లిదండ్రుల కష్టాన్ని దోచుకుంటున్నాయని, ఈ దశలో ప్రభుత్వం చేతలుడిగి చూస్తోందని కృష్ణయ్య, రమణలు అన్నారు. . ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాల ఫీజు దోపిడీపై తల్లిదండ్రులు ఎన్నిసార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా చర్యలు కనిపించడం లేదు. అప్పటికప్పుడు తూతూ మంత్రంగా చర్యలు చేపట్టినా అది కొన్నాళ్లకే పరిమితమవుతుంది. మరోవైపు ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు ముట్టజెప్పే లంచాలకు అలవాటు పడి అధికారులు చర్యలు తీసుకోవడం మానేశారని కొందరు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీంతో నియంత్రణ లేని ప్రైవేటు స్కూల్ ఫీజులపై పేరెంట్స్ అసోసియేషన్ సమరానికి సై అంటున్నారు.
సైవ్రేటు స్కూళ్లలో పిల్లలను చదివిస్తున్న తల్లిదండ్రులంతా ఒక్కతాటిపైకి చేరి నియంత్రణ లేని స్కూల్ ఫీజులపై పోరాటానికి సిద్దమవుతున్నారు. ప్రైవేట్ స్కూళ్ల దోపిడీని ఖండించి తమ ఆవేదన ఏంటో వినిపించేందుకు వీరు సిద్ధమవుతున్నారు. ఈ చదువుల వ్యాపారానికి ఇప్పటికైనా అడ్డుకట్ట పడాలని కోరారు. ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణ కోసం తల్లిదండ్రులు చేస్తున్న పోరాటానికి తమ మద్దతు ఉంటుందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఇందిరాపార్కు వద్ద పేరెంట్స్ చేస్తున్న ధర్నాకు ఆయన సంఘీభావం తెలిపారు. స్కూలు ఫీజుల నియంత్రణ కమిటీ చేస్తున్న ఆందోళనలో తమ పార్టీ ప్రత్యంగా పాల్గొంటుందని ప్రకటించారు. విద్యలో పటిష్టమైన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలం అయిందని విమర్శించారు.