ఫోన్ల ట్యాపింగ్‌కు ప్రాథమిక ఆధారాలు లేవు

విపక్షాల తీరుపై మండిపడ్డ ఎంపి రవిప్రసాద్‌
న్యూఢల్లీి,ఆగస్ట్‌5( జనంసాక్షి): పార్లమెంట్‌లో విపక్షాలు వ్యవహరిస్తున్న తీరును కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్‌ నేత రవి శంకర్‌ ప్రసాద్‌ దుయ్యబట్టారు. ఫోన్లు ట్యాప్‌ చేయబడ్డాయని సూచించడానికి ‘ప్రాథమిక ఆధారాలు‘ ఏవీ లేవని అన్నారు. పార్లమెంట్‌ వేదికగా అర్థవంతమైన చర్చలు జరపడానికి తమ ప్రభుత్వం సిద్ధంగానే ఉందని, పెగాసస్‌పై కూడా చర్చించడానికి సిద్ధంగానే ఉన్నామని స్పష్టం చేశారు. రవిశంకర్‌ ప్రసాద్‌ గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పెగాసస్‌ విషయంలో ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ స్పందన తెలియజేసినపుడు దానిపై ప్రతిపక్షాలు వివరణ కోరే ఛాన్స్‌ ఉందని, అయితే ఆ ప్రకటనకు సంబంధించిన కాగితాలను ప్రతిపక్ష నేతలు చించేశారని అన్నారు. పార్లమెంట్‌ సంప్రదాయాలను గౌరవించే లక్షణం కాంగ్రెస్‌కు ఏమత్రం లేదని, తమ తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రతిపక్షాలు కూడా అందుకు తోడ్పాటునిస్తాయని తీవ్రంగా మండిపడ్డారు. పెగాసస్‌ వివాదం వెనుక ఓ పెద్ద కుట్ర నడుస్తోందని, దాని వెనుక మోదీ వ్యతిరేక ఎజెండాను అవలంబించే వ్యతిరేకుల హస్తం ఉందని, ఇదంతా ఉద్దేశపూర్వకంగానే జరుగుతోందని రవిశంకర్‌ ప్రసాద్‌ దుయ్యబట్టారు.