ఫ్రెండ్లీ పోలీస్‌తో ప్రజల్లో మమేకం కావాలి
సమస్యల తక్షణ పరిష్కారంకు పోలీసులు చొరవ చూపాలి
తెలంగాణ పోలీస్ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది
పోలీసు స్టేషన్లలో రిసెప్షన్ భవనాలు ప్రారంభించిన మంత్రి
అదిలాబాద్, జూన్19(జనం సాక్షి ) : ఫ్రెండ్లీ పోలీస్‌తో పోలీసులు ప్రజల్లో మమేకమై వారు ఎదుర్కొనే సమస్యల పరిష్కారంలో చొరవ చూపాలని రాష్ట్ర మంత్రి జోగురామన్న అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్, రూరల్ పోలీస్ స్టేషన్ లో రూ. 20 లక్షలతో నిర్మించిన రెండు రిసెప్షన్ భవనాలను అటవీశాఖ మంత్రి జోగు రామన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ.. ఫ్రెండ్లీ పోలీసులో భాగంగా పోలీస్ స్టేషన్ అంటే భయాన్ని వీడి నిర్భయంగా వచ్చి తమ సమస్యలను చెప్పుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా యాభై రిసెప్షన్ భవనాలను నిర్మిస్తున్నామని చెప్పారు. శాంతి భద్రతలు అదుపులో ఉంటేనే రాష్ట్రం పురోగతి వైపు పయనిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణలో పోలీసు వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి ఉద్ఘాటించారు. ఇప్పటికే దేశానికే ఆదర్శంగా తెలంగాణ పోలీస్ నిలుస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు తమ దృష్టికి వచ్చిన సమస్యలను తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.