ఫ్లోరిన్ గ్రామాల్లో కేంద్రబృందం పర్యటన నల్గొండ జిల్లాలోని పలు మండలాల్లో పరిశీలన
నల్గొండ, నవంబర్22: ఫ్లొరిన్ సమస్యతో సతమతమవుతున్న పలు గ్రామాల్లో కేంద్రబృందం పర్యటించింది. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నది. పలు పాఠశాలల్లోని విద్యార్థులకు ప్రభుత్వం కల్పించిన నీటి వసతులు, ఇతర వసతులను పరిశీలించింది. నల్గొండ జిల్లాలోని చౌటుప్పల్, సంస్థాన్‌నారాయణపూర్, మర్రిగూడ మండలాల్లో న్యూఢిల్లీకి చెందిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్టేష్రన్ అధికారుల బృందం గురువారం పర్యటించింది. సంస్థాన్‌నారాయణపూర్ మండలంలోని జనగాంలో గల పారఠశాలకు వెళ్లి అక్కడి వసతులను పరిశీలించారు. వాటి గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలోని నీటి వసతిని పరిశీలించారు. మధ్యాహ్న భోజనం తీరు తెన్నును పరిశీలించి మెనూ ప్రకారం అందుతుందా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఐఐపీఏ ప్రొఫెసర్ సుజాతాసింగ్ మాట్లాడుతూ ఐఐపీఏ చెందిన 40 మంది సభ్యులు 5 బృందాలుగా ఏర్పడి ప్రభుత్వ పథకాల అమలు తీరుపై అడిగి తెలుసుకుంటున్నట్లు తెలిపారు. నల్గొండ, మెదక్ జల్లాలు, మేఘాలయ, హర్యానా, మహారాష్ట్రలలో పర్యటిస్తున్నట్లు తెలిపారు. తమ అధ్యయన నివేదికను ప్రభుత్వానికి నివేదించనున్నట్లు వివరించారు. ఫ్లోరిన్ సమస్యతో బాధపడుతున్న ప్రజలకు అందుతున్న వైద్య సహాయం అడిగి తెలుసుకున్నారు. ఈ బృందంలో ఐఐపీఏ ప్రొఫెసర్ సుజాతాసింగ్, బ్రిగేడియర్‌లు రవిప్రసాద్, నారాయణన్ భానోధ్, నరెందర్ దబాస్, జాకబ్ అరోరా, సెంట్రల్ వాటర్ సప్లయ్ స్కీం జాయింట్ సెక్రెటరీ గుప్తా, ఈఈ వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.
నల్గొండ జిల్లాలోని 70 శాతం గ్రామాలు ఫొరిన్ సమస్యతో సతమతమవుతున్నాయి. పాలకులు మారినా, జిల్లా ప్రతినిధులు మారినా ప్రజల ఫ్లొరిన్ సమస్యకు మాత్రం పరిష్కారం లభించడం లేదు. జిల్లాలో కాళ్లు వంకర్లు తిరిగి నడవలేక అవస్థలు పడే వారు కోకొల్లలు. వారిని చూసిని ఈ పాలకులకు కరణ కలుగడం లేదు. వారి ఓట్లు మాత్రం పాలకులకు అవసరం. జిల్లా నుంచి కృష్ణా జలాలు తరలుతున్నా జిల్లావాసులకు గుక్కెడు మంచినీరు దొరకడం లేదు. గతిలేని పరిస్థితిలో ఫ్లొరిన్ కలిసిన నీరే దిక్కవుతోంది. కాళ్లు, కీళ్ల నొప్పులతో జిల్లా వాసులు సతమతమవుతున్నారు. గతంలో ఎన్ని బృందాలు పర్యటించినా జిల్లావాసుల తలరాత మారడంలేదు. ఈ బృందమైనా సమస్యకు పరిష్కారం చూపుతుందో వేచి చూడడాలి మరి!.