బంగారు తల్లికి చట్టబద్ధత కల్పిస్తాం

బెల్ట్‌ షాపులు ఎత్తేస్తాం : సీఎం కిరణ్‌
మరుగుదొడ్ల నిర్మాణానికి రూ. 10 వేలు : కేంద్రమంత్రి జైరాం రమేశ్‌రి
ఏలూరు, మే 5 (జనంసాక్షి):
‘బంగారుతల్లి’కి జూన్‌లో చట్టబద్ధత కల్పించనున్నట్లు ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌ కుమార్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఎస్‌సీ, ఎస్‌టీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించినట్టుగానే బంగారుతల్లికి కూడా  చట్టం చేయనున్నట్టు వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా పట్టణంలోని ఆటోనగర్‌లో  ఆదివారం  బహిరంగసభ ఏర్పాటైంది. వేదికపై కేంద్ర మంత్రి జైరాంరమేష్‌, ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌ కుమార్‌రెడ్డి, ఎంపి కావూరి సాంబశివరావు, మంత్రులు పితాని సత్యనారాయణ, వట్టి వసంతకుమార్‌, టీటీడీ చైర్మన్‌ కనుమూరి బాపిరాజు, ఎమ్మెల్యేలు నాని, సుబ్బారాయుడు తదితరులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ జూన్‌లో నిర్వహించనున్న అసెంబ్లీ సమావేశాల్లో బంగారు తల్లి పథకంపై బిల్లు ప్రవేశపెడతామని, అందరూ ఆ బిల్లును స్వాగతించాలని కోరారు. ఆ సమావేశాల్లోనే బంగారుతల్లికి చట్టబద్దత కల్పిస్తామన్నారు. బంగారుతల్లి పథకం  ఆపేయకుండా డిగ్రీ వరకు చదువుకుని ఆపేస్తే లక్ష రూపాయలిస్తామని ప్రకటించారు. అధికారంలో ఎవరు ఉన్నప్పటికీ కూడా బంగారుతల్లి పధకం సక్రమంగా అమలయ్యేందుకు జూన్‌ నెలలో నిర్వహించనున్న అసెంబ్లీ సమావేశాల్లో చట్టబద్దత కల్పించనున్నామన్నారు. అంతేగాక కేంద్ర మంత్రి జైరాంరమేష్‌ ఆదేశాల మేరకు, మహిళల అభీష్టం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వెలసిన బెల్టు షాపులను దశలవారీగా తొలగిస్తామని, ఆదేశాలు త్వరలోనే జారీ చేయనున్నట్టు ప్రకటించారు. అంతేగాక స్వయం సహాయక గ్రూపుల్లోని మహిళలు తమ ఇంటిలో తప్పనిసరిగా మరుగుదొడ్డి నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మరుగుదొడ్డి నిర్మాణానికి అవసరమైన  పదివేల రూపాయలను కేంద్రప్రభుత్వం అందించనున్నట్టు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్న స్వయం సహాయక గ్రూపుల్లోని మహిళలందరూ రెండేళ్లలోపు మరుగుదొడ్లను నిర్మించుకోవాలని కోరారు. ఈ ఏడాది బడ్జెట్‌లో మహిళలకు రూ.16,500 కోట్లను రుణాలుగా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ ప్లాన్‌కు చట్టబద్దత కల్పించడమే గాక అందుకు అవసరమైన రూ.12,250 కోట్లను కేటాయించా మన్నారు. 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన వచ్చే బడ్జెట్‌లో అంటే 2014 ఏప్రిల్‌ నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్‌లో ఎస్‌సి, ఎస్‌టి వర్గాలకు కొంత మేర నిధులు పెరగనున్నాయన్నారు. వారికి కేటాయించిన నిధులను వారికే ఖర్చు చేయనున్నట్టు తెలిపారు. అంతేగాక ఎస్‌సిలు ఇల్లు కట్టుకునేందుకు లక్ష రూపాయలు కేటాయించామని, ఎస్‌టిలకు 1,05,000 అందించనున్నట్టు వెల్లడించారు. ఎస్‌సి, ఎస్‌టి కాలనీల్లో నివసించే వారు 50 యూనిట్లలోపు విద్యుత్‌నకు బిల్లు చెల్లించనవసరం లేదన్నారు. వారి తరఫున ప్రభుత్వమే చెల్లిస్తుంద న్నారు. 50యూనిట్లు దాటితే వారే ఆ బిల్లు చెల్లించాలని కోరుతున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎస్‌సి విద్యార్థుల హాస్టళ్లు 5, ఎస్‌టి విద్యార్థుల కోసం 27 హాస్టళ్లు ఉన్నట్టు గుర్తించామన్నారు. అయితే ఇందిరమ్మ కలలు పథకం కింద ఎస్‌సి విద్యార్థుల కోసం మరో 95హాస్టళ్లను నిర్మించనున్నట్టు తెలిపారు. అలాగే ఎస్‌టి విద్యార్థుల కోసం మరో 223 హాస్టళ్లను మంజూరు చేస్తున్నామన్నారు. మొత్తం 350 హాస్టళ్ల భవన నిర్మాణానికి గాను 450 కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నట్టు తెలిపారు. దానివల్ల 70వేల మంది ఎస్‌సి, ఎస్‌టి విద్యార్థులు చేరేందుకు మార్గం సుగమమవుతుందన్నారు. ఇందిరజల ప్రభ ద్వారా సాగునీరు అందించనున్నట్టు వెల్లడించారు. కిలో రూపాయి బియ్యంతో పాటు, తొమ్మిది నిత్యావసర వస్తువులను కేవలం 185 రూపాయలకే అందజేస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. రానున్న పంచాయతీ, మునిసిపల్‌, జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్‌ కల్పించనున్నట్టు వెల్లడించారు.
గ్రామీణాభివృద్ధికి కృషి : జైరాంరమేష్‌
గ్రామీణాభివృద్ధికి కృషి చేస్తున్నామని కేంద్ర మంత్రి జైరాంరమేష్‌ అన్నారు. బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకుని సద్వినియోగం చేసుకుని ఆర్థికవేత్తలుగా మహిళలు ఎదిగినందుకు సంతోషంగా ఉందన్నారు. పెన్షన్‌ వల్ల ఎంతోమందికి మేలు చేకూరుతోందన్నారు. మహిళలను రెండు ప్రశ్నలు వేయదల్చుకున్నానన్నారు. స్వయంసహాయక గ్రూపుల్లోని మహిళలందరి ఇళ్లల్లో ఎంతమందికి మరుగుదొడ్లు ఉన్నాయో చెప్పండి అని మహిళలను ప్రశ్నించారు. లేవని చాలామంది మహిళలు చెప్పారు. దీంతో కేంద్ర మంత్రి స్పందిస్తూ.. ఇప్పటికీ బహిర్భూమికి వెళ్లడం దురదృష్టకరమన్నారు. ప్రతి ఇంటిలోని మరుగుదొడ్డి నిర్మాణానికి గాను 10వేల రూపాయలను కేంద్రం అందజేయనున్నట్టు ప్రకటించారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని రెండేళ్లల్లోగా మరుగుదొడ్డి లేని ఇల్లు ఉండకూడదని కోరారు. రెండో ప్రశ్నగా.. బెల్టుషాపులు తొలగించాలా.. ఉంచాలా అని ప్రశ్నించారు. చాలామంది మహిళలు ఎత్తివేయాలని కోరారు. దీంతో బెల్టుషాపులను తొలగించేలా నిర్ణయం తీసుకోవాలని సిఎంను కోరారు. బెల్టు దుకాణాల వల్ల మహిళలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. వాటన్నింటిని దృష్టిలో పెట్టుకుని వెంటనే తొలగించాలని కోరారు.