బంగారు తెలంగాణలో బడి మూసేందుకు సిద్ధం
పట్టించుకోని మండల విద్యాధికారి పాలకవర్గం
ధూల్మిట్ట (జనంసాక్షి) జూన్ 25 : ఉమ్మడి మద్దూరు మండలంలోని, లింగాపూర్ ప్రాథమిక పాఠశాల మూసివేతకు సిద్ధమైందని, బహుజన సేన జనగామ జిల్లా కన్వీనర్ గద్దల మహేందర్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యారంగాన్ని పట్టించుకోవడం లేదని, మద్యం పైన ఉన్న శ్రద్ధ పాఠశాలల పైన లేదని విమర్శించారు. పాఠశాల ప్రారంభం రోజు 30 మంది పిల్లలు వచ్చిన, ఒకే టీచర్ ఉండటం వల్ల విద్యా బోధన సరిగా జరగడం లేదని, పిల్లల తల్లిదండ్రులు ప్రైవేటు వైపు మొగ్గు చూపగా మరికొందరు ఇతర పాఠశాలలకు పంపిస్తున్నారు దీంతో విద్యార్థుల సంఖ్య నలుగురే హాజరవుతున్నారు. గత మూడు నాలుగు రోజుల నుండి ఎవరూ రాకపోవడంతో శనివారం పాఠశాలకు తాళం వేసి ఉంచారు. పాఠశాల ఉపాధ్యాయుడు చాలాసార్లు మండల అధికారితో, పంచాయతీ పాలకవర్గంతో ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని వాపోయారు. దీంతో పాఠశాల దుస్థితి దిగజారిపోయి గ్రామ పిల్లలకు విద్య దూరం కావడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా విద్యాధికారి పాఠశాలపై ప్రత్యేక శ్రద్ధ చూపి, పిల్లల హాజరు శాతం పెంచే విధంగా చర్యలు చేపట్టాలని, ఇద్దరూ ఉపాధ్యాయులను నియమించే విధంగా ప్రభుత్వం చర్యలు చేయాలని డిమాండ్ చేశారు.