బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
– మరో మూడురోజుల్లో విస్తారంగా వర్షాలు
విజయవాడ, ఆగస్టు15(జనం సాక్షి) : తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో పలు ప్రాంతాల ప్రజలు అతలాకుతలమవుతున్నారు. గత నాలుగు రోజుల నుండి అడపాదడపా వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఈ నెల 18 నాటికి ఉత్తర బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ప్రస్తుతం పశ్చిమ్‌బంగా, ఒడిశాలోని కోస్తా ప్రాంతాలను ఆనుకుని ఏర్పడిన తీవ్ర అల్పపీడన ప్రాంతం స్థిరంగా కొనసాగుతోంది. దీనికి తోడు కోస్తాంధ్ర తీరాన్ని ఆనుకుని 7.6 కిలోవిూటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి కూడా కొనసాగుతోందని వాతావరణశాఖ స్పష్టం చేసింది. బెంగాల్- ఒడిశా తీరాన్ని ఆనుకుని ఉన్న తీవ్ర అల్పపీడన ప్రాంతం మరింత బలపడి వాయుగుండంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. వీటి ప్రభావంతో నైరుతి రుతుపనాలు మరోసారి క్రియాశీలంకంగా మారాయని అధికారులు చెబుతున్నారు. వీటి ప్రభావంతో ఒడిశాతో పాటు ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అటు తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ మోస్తరు నుంచి విస్తారంగానే వర్షాలు పడుతున్నట్టు వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. అటు రాయలసీమ జిల్లాల్లోనూ తేలిక పాటి జల్లులు పడతున్నాయి. రాగల రెండు రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లోనూ చాలా చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. గడచిన 24 గంటల్లో శ్రీకాకుళంలో అత్యధికంగా 14.9 సెంటివిూటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలోని మరో ఆరు చోట్ల 11 సెంటివిూటర్ల వరకూ వర్షపాతం రికార్డు అయింది. విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో చాలా చోట్ల 6 సెంటివిూటర్ల వరకూ వర్షం కురిసినట్లు వాతావరణశాఖ స్పష్టం చేసింది. 1.5 సెంటివిూటర్ల నుంచి 4 సెంటివిూటర్ల మధ్య 269 ప్రాంతాల్లో వర్షం కురిసిందని అధికారులు వెల్లడించారు.