బంగ్లా ఖాళీ చేసిన కళ్యాణ్‌ సింగ్‌

సుప్రీం ఆదేశాలు పాటించిన తొలి మాజీ సిఎం
లక్నో,మే23( జ‌నం సాక్షి): రాజస్థాన్‌ గవర్నర్‌ కల్యాణ్‌ సింగ్‌ ఉత్తర ప్రదేశ్‌లోని తన ప్రభుత్వ బంగ్లాను ఖాళీచేశారు. గతంలో యూపీ సీఎంగా పనిచేసిన ఆయన… ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసిన ఆరుగురు మాజీ సీఎంలలో మొదటి వ్యక్తిగా నిలిచారు. మంగళవారం నుంచి తన ఇంట్లో వస్తువులను తరలిస్తున్న కల్యాణ్‌ సింగ్‌.. ఈ నెలాఖరు కల్లా భవనం నుంచి పూర్తిగా నిష్కమ్రించనున్నారు. యూపీ సహాయమంత్రి, తన మనవడు సందీప్‌ సింగ్‌ ఇంట్లోకి ఆయన మారుతున్నారు. 1999 నవంబర్‌లో ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత కల్యాణ్‌ సింగ్‌కు ప్రభుత్వ బంగ్లా కేటాయించారు.  కాగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కల్యాణ్‌ సింగ్‌ సహా మాజీ ముఖ్యమంత్రులంతా తమ ప్రభుత్వ బంగ్లాలను ఖాళీ చేయాలంటూ ఇటీవల యోగి ప్రభుత్వం నోటీసులు జారీచేసింది. ప్రస్తుతం కేంద్ర ¬ంమంత్రిగా ఉన్న యూపీ మాజీ సీఎం రాజ్‌నాథ్‌ సింగ్‌ సైతం తన ఇల్లు ఖాళీ చేయనున్నారు. గోమతి నగర్‌లోని తన నివాసానికి వస్తువులను తరలించనున్నారు. కాగా తన బంగ్లా ఖాళీ చేసేందుకు మరో రెండేళ్ల సమయం కావాలంటూ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ కోరిన సంగతి తెలిసిందే.
——–