బంగ్లా, పాక్‌లలో దారుణం
– మంత్రి, ఫ్రొఫెసర్ల దారుణ హత్య
పెషావర్,ఏప్రిల్ 23(జనంసాక్షి): పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌కు చెందిన ఓ మంత్రిపై గుర్తుతెలియని దుండగులు బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ ఘటనలో మంత్రి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. గతంలో కూడా ఇలా ఓ మంత్రిని కాల్చి చంపారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ అసెంబ్లీలో సర్దార్ సోరన్ సింగ్ మైనారిటీ సంక్షేమశాఖ మంత్రిగా ఉన్నారు. సర్దార్ శుక్రవారం తన కారులో వెళ్తుండగా.. బునేర్ జిల్లాలో బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు మంత్రి కారును అడ్డుకున్నారు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే.. దుండగులు ఆయనపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సర్దార్ అక్కడికక్కడే మృతి చెందారు. సర్దార్ హత్యకు గురైనట్లు ప్రావిన్స్ సమాచార మంత్రి ముస్తాఖ్ ఘని ధ్రువీకరించారు. కాల్పులకు బాధ్యత వహిస్తూ.. ఇంతవరకు ఎవరూ ఎలాంటి ప్రకటనలు చేయలేదు. అయితే తాలిబన్ ఉగ్రవాదులే ఈ ఘటనకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. దీనిపై వెంటనే దర్యాప్తు ప్రారంభించారు.
బంగ్లాదేశీ ప్రొఫెసర్ దారుణ హత్య
బంగ్లాదేశ్‌లోని రాజ్‌షాహి నగరంలో ఓ ప్రొఫెసర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. రాజ్‌షాహి యూనివర్సిటీలో ఇంగ్లిష్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న రేజౌల్ కరిమ్ సిద్ధిఖి(58)ని ఆయన ఇంటి సవిూపంలోనే నరికి చంపేశారు. యూనివర్సిటీకి వెళ్లడానికి బస్సు కోసం ఎదురుచూస్తుండగా ఇద్దరు లేదా ముగ్గురు దుండగులు వెనుక నుంచి దాడి చేశారు. మెడపై పదునైన ఆయుధంతో దాడి చేసినట్లు సిటీ పోలీస్ కమిషనర్ సాధిర్ హైదర్ చౌదర్ వెల్లడించారు. ఈ ఘటనలో ప్రొఫెసర్ అక్కడికక్కడే మరణించినట్లు చెప్పారు. బంగ్లాదేశ్‌లో ఇటీవల సెక్యులర్ బ్లాగర్లపై దాడి చేసి హతమార్చిన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ప్రొఫెసర్ హత్య వెనుక కూడా ఇస్లామిక్ ఉగ్రవాదుల హస్తం ఉందేమోనని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు