బందీల విడుదలకు ఐఎస్‌ఐఎస్‌ కొత్త షరతు

1

-ఇరాక్‌ మహిళలను విడుదల చేయాలని డిమాండ్‌

-షరతులకు తలొగ్గకపోతే ఇద్దరు బందీలను హతమారుస్తాం

-మిలిటెంట్ల డిమాండ్లకు తలొగ్గిన జోర్డాన్‌

టోక్యో: ఇస్లామిక్‌ స్టేట్‌(ఐఎస్‌) ఉగ్రవాదులు తమ వద్ద బందీలుగా ఉన్న జపాన్‌ దేశీయునితో పాటు, జోర్డాన్‌ దేశానికి చెందిన పైలట్‌ను విడుదల చేయడానికి తాజాగా కొత్త షరతులు   విధించారు. జపాన్‌కు చెందిన విలేకరి కెంజి గోటోను, జోర్డాన్‌కు చెందిన లెఫ్ట్‌నెంట్‌ మువాత్‌ అల్‌ కసీస్‌బేను విడుదల చేయాలంటే సాజిదా అల్‌ రిష్వీ అనే ఇరాక్‌ మహిళను జోర్డాన్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. లేదంటే 24 గంటల్లో బందీలను హతమార్చుతామని హెచ్చరిస్తూ మంగళవారం ఓ సందేశాన్ని ఆన్‌లైన్‌లో ఉంచారు. 2005లో జోర్డాన్‌ రాజధాని అమ్మాన్‌లోని ఓ ¬టల్‌లో జరిగిన ఉగ్రవాద దాడితో సాజిదా అల్‌ రిష్వీకి ప్రమేయమున్నందున ఆమెకు న్యాయస్థానం మరణశిక్ష విధించింది. సదరు దాడిలో 60 మంది మృతిచెందారు. కాగా తమ దేశీయుడైన మువాత్‌ అల్‌ కసీస్‌బేను క్షేమంగా విడుదలచేస్తే మహిళా జిహాదీని విడుదల చేయడానికి సిద్ధమేనని జోర్డాన్‌ తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వ అధికార ప్రతినిధి వెల్లడించినట్లు ప్రభుత్వ ఛానెల్‌ పేర్కొంది. జపాన్‌ దేశీయుని గురించి జోర్డాన్‌ ప్రభుత్వం ఎక్కడా పేర్కొనలేదు. మరోవైపు గోటో విడుదలపై జపాన్‌..జోర్డాన్‌ సహాయం కోరింది. విదేశీ ఉపమంత్రి ఆధ్వర్యంలో ఓ బృందాన్ని అమ్మాన్‌కు పంపింది.

ఇస్లామిక్‌ ఉగ్రవాదుల షరతులపై జపాన్‌ ప్రధాని షింజో అబే స్పందిస్తూ.. ఇది హేయమైన చర్య అని, తమ దేశీయుడిని వెంటనే విడుదల చేయాలన్నారు. ఇద్దరు జపాన్‌ దేశీయులను నిర్బంధించిన ఐఎస్‌ ఉగ్రవాదులు ఇప్పటికే వారిలో ఒకరిని హతమార్చిన విషయం తెలిసిందే.