బడాచోర్‌లను పక్కనపెట్టి రైతులవెంట పడతారా!
– ఆర్‌బీఐపై వైఖరిపై సుప్రీం గుస్సా
న్యూఢిల్లీ,ఏప్రిల్ 12(జనంసాక్షి):రుణ ఎగవేతదారుల విషయంలో ఆర్‌బీఐ చర్యలపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తి చేసింది. ఆర్‌బీఐ వాచ్‌డాగ్‌లా పనిచేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వేలకోట్ల రుణాలను ఎగవేసిన వారిని కాదని మామూలు రైతులను వేధించడం తగదన్నారు. రుణ ఎగవేతదారుల వివరాలు వెల్లడించలేమన్న ఆర్‌బీఐ తీరుపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా సుప్రీకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. బ్యాంకుల నుంచి వేల కోట్లు అప్పులు తీసుకొని వ్యాపార సామ్రాజ్యాలు నడుపుతున్నారు. వ్యాపార సామ్రాజ్యాలు నడిపేవారే దివాళా పేరుతో చేతులు ఎత్తేస్తున్నారు. వేల కోట్లు ఎగవేసిన వారిని బ్యాంకులు ఏవిూ చేయలేకపోతున్నాయి. చిన్న మొత్తాల్లో వ్యవసాయ రుణాలు తీసుకునే రైతులను బ్యాంకు పీడిస్తున్నాయి. రుణాలు చెల్లించకపోతే రైతుల ఆస్తులను జప్తు చేస్తున్నారు. అని వ్యాఖ్యానిచింది. ఆర్‌బీఐ ఇటీవల రూ.500కోట్లకు పైగా బకాయిలు ఉన్న వ్యక్తులు, సంస్థల వివరాలతో సీల్డ్ కవర్‌లో సుప్రీంకోర్టుకు నివేదిక అందజేసింది. కానీ వారి వివరాలు
గోప్యంగా ఉంచాలని కోరింది. నిరర్థక ఆస్తుల వివరాలు వెల్లడిస్తే ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుందని ఆర్‌బీఐ సుప్రీంకోర్టుకు తెలిపింది. రూ.500కోట్లకు పైగా బకాయిలు వారి పేర్లు వెల్లడించాలని ప్రశాంత్ భూషణ్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. రుణ ఎగవేత దారుల అంశంపై వివరణ ఇవ్వాలని ఐబీఏ, ఆర్థిక మంత్రిత్వశాఖకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను న్యాయస్థానం ఈనెల 26కు వాయిదా వేసింది. 8 ప్రభుత్వ రంగ బ్యాంకులు 2013 నుంచి 2015 ఆర్థిక సంవత్సరాల మధ్య దాదాపు రూ.1.14లక్షల కోట్ల మొండి బకాయిలు ఉన్నాయని గతంలో వెల్లడించాయి