బడ్జెట్‌ అంతా కాకి లెక్కలే కాగ్‌ అక్షింతలు

కేటాయించిన నిధులు ఖర్చు  చేయలేదు
ఖర్చు చేసినా ప్రయోజనం చేకూరలేదు
హైదరాబాద్‌, మార్చి 26 (జనంసాక్షి) : రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖలకు కేటాయించిన నిధులను సక్రమంగా ఖర్చు చేయకపోవడంతో ఆయా శాఖల పనితీరు, సామర్థ్యం సన్నగిల్లిందని భారత కంట్రోలర్‌ అండ్‌ అడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నివేదికలో స్పష్టం చేసింది. 2012 మార్చితో ముగిసిన ఆర్థిక స్థితిగతులకు సంబంధించిన నివేదికను మంగళవారం శాసనసభ ముందుంచారు. ఈ సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ ప్రసంగంలోనూ  వార్షిక ప్రణాళికలోనూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రధాన విధాన నిర్ణయాలు, పథకాలకు సంబంధించి  కాగ్‌ సుదీర్ఘంగా పరిశీలించింది. అందులో కొన్ని శాఖలకు కేటాయించిన నిధులు సక్రమంగా ఖర్చు చేయకపోవడంతో ఆ శాఖల్లో చాలా లోటుపాట్లు జరిగాయని కాగ్‌ గుర్తించింది. చేనేత కార్మిక సంఘాలను , కార్మికులను అప్పుల బారి నుంచి రక్షించేందుకు  నేత కార్మికుల రుణమాఫీ పేరిట ఒక పథకాన్ని ప్రవేశపెట్టి  బెడ్జెట్‌లో రూ.200 కోట్లు కేటాయించినా  ఈ నిధులను పూర్తి స్థాయిలో  అంటే కేవలం రూ.32.88 కోట్లు అంటే 16 శాతం మాత్రమే ఖర్చు చేయడం వల్ల  ఆ పథకం లక్ష్యం నెరవేరలేదని కాగ్‌ పేర్కొంది. రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్‌ అనే ప్రాయోజిత కార్యక్రమాన్ని కేంద్రం 75 శాతం నిధులు, రాష్ట్రం 25 శాతం నిధులు సమకూర్చి 14 నుంచి 18 ఏళ్ల గల వారికి విద్యనందించాలి.  పాఠశాలలకు అవసరమైన మౌలిక వసతులు, బోధన, బోధనేతర సిబ్బందిని నియమించాలి. రాష్ట్ర ప్రభుత్వం తనవంతుగా రూ.300 కోట్లు  కేటాయించినా ఇందులో 96.53 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని కాగ్‌ నివేదిక పేర్కొంది.  కిశోర ప్రాయ బాలికలలో స్వయం వికాసం పెంపొందించేందుకు 11 నుంచి 18 సంవత్సరాల వయస్సు గల ఆడపిల్లల్లో అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం రాజీవ్‌గాంధీ కిశోర బాలికల సమున్నత (సబల) అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే 124.91 కోట్ల రూపాయలు రాష్ట్రానికి రాగా, అందులో 16 శాతం అంటే 20.25 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని కాగ్‌ తన నివేదికలో పేర్కొంది. బాలింతలకు, గర్భిణిలకు నగదు ప్రోత్సాహకం నేరుగా అందజేసేందుకు కేంద్రం ఇందిరాగాంధీ మాతృత్వ సహాయోగ్‌ యోజన పథకాన్ని ప్రారంభించింది. ఈ నిధులు పూర్తిగా కేంద్రం నుంచే వస్తాయి. 2011-12 ఆర్థిక సంవత్సరంలో పశ్చిమగోదావరి, నల్లగొండ జిల్లాలో పై పథకాన్ని అమలు చేసేందుకు 10.32 కోట్లు కేటాయించినా రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.1.26 కోట్లు మాత్రమే ఖర్చు చేయడం ఆ శాఖ పనితీరుకు నిదర్శనమని కాగ్‌ పేర్కొంది.  రాష్ట్ర రహదారి ప్రాజెక్టు

(ఏపీఎస్‌హెచ్‌పీ) పథకం కింద రాష్ట్రంలోని రోడ్లను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం, ప్రపంచబ్యాంకు ఆమోదించాయి. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.3165 కోట్లు కాగా 2011-12 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో రూ.600 కోట్లు కేటాయించగా, ఇందులో కేవలం 221.27 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. జాతీయ గ్రామీణ రక్షిత మంచినీటి కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా వందకోట్లుకేటాయించినా రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల చేయలేదు. నిరుద్యోగులకు తగిన నైపుణ్యం కలిగించి వారు ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగావకాశాలు పొందేలా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్‌ ఉద్యోగశ్రీ సొసైటీ స్థాపించింది.  ఇందు కోసం 2011-12 బడ్జెట్‌లో రూ.40 కోట్లు కేటాయించినా ఇందులో పది కోట్లు మాత్రమే ఖర్చు చేసింది.   అయితే నిధులే విడుదల చేయలేదు. గ్రామీణ పారిశుద్ధ్యం కోసం పంచాయతీరాజ్‌ సంస్థలకు ప్రభుత్వం రూ. 100 కోట్లు కేటాయించింది. ఈ పథకానికి రూ. 28 కోట్లు మాత్రమే వెచ్చింది. 9.28 లక్షల వ్యక్తిగత మరుగుదొడ్లకు గాను, 0.91 లక్షల మరుగుదొడ్లను మాత్రమే నిర్మించారు. పేద పిల్లలకు మధ్యాహ్న భోజనం సమకూర్చేందుకు ప్రభుత్వం ఆర్భాటంగా 1.112 కోట్ల రూపాయలు కేటాయించినా ఇందులో 673 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారు. ఇలా చూసుకుంటూపోతే ప్రభుత్వం బడ్జెట్‌ కేటాయింపుల నిధులకు , ఖర్చు చేసిన నిధులకు పొంతనే లేదని కాగ్‌ పేర్కొంది.