బయ్యారం ఉక్కును దోచుకున్న కాంగ్రెస్
వారికి దీనిపై మాట్లాడే హక్కు లేదు
టిఆర్‌ఎస్ మాత్రమే ప్రజల పక్షాన పోరాడుతోంది
ప్రచారంలో ఎంపి సీతారాం నాయక్
మహబూబాబాద్,అక్టోబర్30(జనంసాక్షి): బయ్యారం ఉక్కు పరిశ్రమపై మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని ఎంపీ సీతారాంనాయక్ అన్నారు. నాడు బయ్యారం ఉక్కును దోచుకుపోయిన కాంగ్రెస్ నేతలు టీఆర్‌ఎస్ ఒత్తిడి కారణంగా విభజన బిల్లులో ఉక్కు పరిశ్రమ హావిూ ఇచ్చారని గుర్తు చేశారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తన అల్లుడు అనిల్ కుమార్‌కు బయ్యారం, నెలకొండలపల్లి, గూడూరు మండలాల్లోని 1.42 లక్షల ఎకరాల్లోని ఖనిజాన్ని కట్టాపెట్టారని గుర్తు చేశారు. రక్షణ స్టీల్స్ కంపెనీతో ఒప్పందం చేసుకున్న ప్పుడు మాట్లాడని కాంగ్రెస్ నాయకుడు నాటి ఎంపీ బలరాంనాయక్ ఉక్కు పరిశ్రమ విషయంలో ఇప్పుడు మాట్లాడడం విడ్డూరమన్నారు. గతంలో స్థానిక కాంగ్రెస్ ఎంపీగా ఉన్న బలరాంనాయక్ పార్లమెంటులో ఎందుకు ప్రశ్నించలేదో సమాధానం చెప్పాలని కోరారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థులకు ఓటేస్తే అభివృద్ధి ఆగినట్టేనని ఎంపీ సీతారాంనాయక్ అన్నారు. తెలంగాణ ఎంపీలుగా పార్లమెంటులో పలు మార్లు ఉక్కు పరిశ్రమ కోసం ప్రశ్నించిన విషయాన్ని ఎంపీ గుర్తు చేశారు. ఇనుప ఖనిజం లేని విశాఖలో ఉక్కు పరిశ్రమ నిర్మాణం జరిగినప్పుడు ఖనిజ నిల్వలు పుష్కలంగా ఉన్న బయ్యారంలోఉక్కు పరిశ్రమ ఎందుకు సాధ్యం కాదన్నారు. త్వరలో టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టోని ప్రకటిస్తామని దీంతో ప్రతి పక్షాలు ఖంగు తింటాయన్నారు. టీఆర్‌ఎప్ ప్రభుత్వం మరోమారు ఏర్పడడం ఖాయమని, తమ పార్టీ అధికారంలోకి వస్తుందని ప్రగల్బాలు పలుకుతున్న ఉత్తమ్‌కుమార్‌కు కూడా ప్రభుత్వ ఏర్పాటు రోజు ఆహ్వానం అందిస్తామన్నారు. 70ఏళ్ల నుంచి తెలంగాణ ప్రాంతాన్ని వంచించి ఇప్పుడు కాంగ్రెస్, టీడీపీ ఒక్కటై మోసపూరిత వాగ్దానాలతో యువతను మోసం చేయాలని చూస్తున్నాయన్నారు. రానున్న రోజుల్లో కేసీఆర్ యువతకు పెద్ద పీట వేయనున్నట్లు చెప్పారు. ఇప్పటికే 1.09లక్షల ఉద్యోగాల భర్తీకి ఆర్థిక మంత్రిత్వశాఖ అనుమతి ఇవ్వగా 87వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వేసినట్లు చెప్పా రు. ప్రాజెక్ట్‌లను, యువతకు ఉద్యోగాల కల్పనకు చేస్తున్న ప్రభుత్వాన్ని కోర్టుకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ ఎలా అడ్డుకున్నదో వారికి గుర్తు చేశారు.