బయ్యారం ఉక్కును విస్మరించడం సరికాదు

ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య

భద్రాద్రి కొత్తగూడెం,జూలై2(జ‌నం సాక్షి): విభజన చట్టంలో బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తామని కేంద్రం హావిూ ఇచ్చిందని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. ఇచ్చిన హావిూని నెరవేర్చకుండా కేంద్రం బయ్యారం ఇనుప ఖనిజం క్వాలిటీ లేదనే సాకు చెబుతుందని ఆరోపించారు.అన్ని వనరులున్నప్పటికీ బయ్యారంలో ప్లాంటు ఏర్పాటు చేయడానికి కేంద్రం వెనుకాడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎటువంటి వనరులు లేని విశాఖలో కేందప్రభుత్వ రంగ సంస్థ సేయిల్‌ ఉక్కు కర్మాగారాన్ని నిర్మించిందని గుర్తు చేశారు. ఐదు వందల కిలోవిూటర్ల దూరం నుంచి విశాఖకు ఇనుప ఖనిజం రవాణా చేస్తూ ఉక్కు ఉత్పత్తిని చేస్తున్నారని , అపారమైన ఖనిజ సంపద ఉన్న బయ్యారంలో కర్మాగారాన్ని ఏర్పాటు చేయడానికి వెనకడుగు వేస్తున్నారన్నారు. బయ్యారం ఉక్కు.. తెలంగాణ హక్కు నినాదం ఇప్పటిది కాదు.. ఉద్యమ సమయంలో బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని ఏజెన్సీ ప్రజలు తీవ్రంగా పోరాటం చేశారని అన్నారు. అది గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఆనాడు హావిూ ఇచ్చిందని అన్నారు. బయ్యారం ఖనిజం బ్రహ్మాండమైందని , 45 ప్లస్‌ క్వాలిటీ ఉందని నాడు సర్వే ఆఫ్‌ ఇండియానే తేల్చి చెప్పిందని గుర్తు చేశారు. కావాల్సిన నీరు,విద్యుత్తు, స్థలం సవిూపంలోనే రైల్వే లైన్‌ తదితర అన్ని సౌకర్యాలున్నప్పటికీ సేయిల్‌ ముందుకు రాకపోవడం బాధాకరమన్నారు. కర్మాగారం కాలుష్యం తట్టుకునే విధంగా సహాజ సిద్ధమైన అడవులు బయ్యారంలో మెండుగా ఉన్నాయన్నారు. విభజన చట్టంలో పొందుపరిచిన విధంగా బయ్యారంలో స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇటీవల మహబూబాబాద్‌ పార్లమెంటు సభ్యుడు అజ్మీరా సీతారాం నాయక్‌, తాను కేంద్ర గనులు పరిశ్రమ శాఖమంత్రిని కలిసి ఇదే విషయం చెప్పామన్నారు. ఇటీవల రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ ప్రధాని నరేంద్రమోదీని కలిసి బయ్యారంలో స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని కోరారని గుర్తు చేశారు. 180 కిలోవిూటర్ల దూరంలో ఉన్న బైలడిలా నుంచి నాణ్యమైన ఖనిజాన్ని తీసుకొచ్చి బయ్యారం ఖనిజాన్ని మిక్స్‌ చేసి ఉక్కును ఉత్పత్తి చేయవచ్చని తెలిపారు. అయిన ప్పటికి సేయిల్‌ ముందుకు రాకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. కేంద్రం ముందుకు రాకపోతే రాష్ట్ర ప్రభుత్వమే ప్లాంటును ఏర్పాటు చేస్తుందని కేటీఆర్‌ చెప్పడం చాలా ఆనందంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్లాంటు ఏర్పాటు పట్ల చిత్తశుద్ధితో ఉందని , విభజన చట్టంలో పొందుపరిచిన హావిూని అమలుపరిచే వరకు కేంద్రంతో రాష్ట్రం పోరాడుతుందని తెలిపారు.